కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది… కేసిఆర్..

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంచినీటి, సాగునీటి సరఫరాలో, కరెంటు సప్లయ్‌లో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడుతుందని భరోసా ఇచ్చారు….కరీంనగర్‌ కదనభేరి సభలో కేసీఆర్‌ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమస్యలు వస్తున్నయో నాకు అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్‌ భగీరత పథకం తీసుకొచ్చినం. ఆదిలాబాద్‌ గోండు గూడెం నుంచి నల్లగొండ లంబాడీ తండా దాకా అందరికీ మంచినీళ్లు అందేలా చూసినం. బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథాకాన్ని నడిపే తెలివిలేదా..? ఎందుకు మిషన్‌ భగీరథలో సమస్యలు వస్తున్నయ్‌..?’ అని ప్రశ్నించారు.

‘నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఏడాదినర్థం తిరగకుండానే కరెంటు పరిస్థితిని చక్కదిద్దినం. ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినం. దాంతో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటు వచ్చింది. రైతు బంధు ఇచ్చినం. కరోనా వచ్చి కాటేసినా రైతుబంధు ఆపలే. ఇయ్యాల ఆ రైతుబంధు ఏసుడు చేతనైతలేదా..? కేసీఆర్‌ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్‌జేసినట్టు కరెంటు బందైతదా..? మేం తొమ్మిదేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్తలేదా..?’ అని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

‘ఇయ్యాల మళ్ల మీరు ఆళ్లకే ఓటేస్తే నష్టపోతరు. మేం రైతుబంధు ఎయ్యకపోయినా.. కరెంటు సక్కగ ఇయ్యకున్నా.. తాగునీటి, సాగునీటి సరఫరా సక్కగ లేకున్నా.. మోటర్లు కాలబెట్టినా.. పొలాలు ఎండబెట్టినా.. జనం మళ్లీ మనకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు. ఈ టైమ్‌లో మీరు కర్రు కాల్చి వాతపెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం వస్తది. అహంకారం పెరుగుతది. ఇయ్యాల చెప్పుతో కొడుత అన్నోడు రేపు నిజంగనే కొడుతడు. ఇట్ల మోసపోదామా..? లేదంటే గులాబీ జెండా ఎగరేసి మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా..? ఇది మన తెలంగాణ సమాజం బాగా ఆలోచించాలె. ఈ లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా అంత బ్రహ్మాండంగా ముందుకుపోతం’ అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.

‘భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉంటే.. అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం పది జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినం. 150 ఉత్తరాలు రాసినం.. పర్సనల్‌గా కలిసి అడిగినం కానీ ఒక్కటంటే ఒక్కటి నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. ఒక్క నవోదయ పాఠశాల, ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి. బండి సంజయ్‌ ఎంపీగా ఏం చేశాడు. ఐదు రూపాయల పని అయినా జరిగిందా. ఎటువంటి వ్యక్తి మనకు ఎంపీగా ఉంటే లాభం అవుతుందనేది ప్రజలు ఆలోచించాలి. ‘ అని కేసీఆర్‌ అన్నారు…