తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి తెరాస తీర్థం పుచ్చుకున్నారు…

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరారు. తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సమక్షంలో మోత్కుపల్లి తెరాస తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి. నాకు అత్యంత సన్నిహితుడు. ఇద్దరం అనేక ఏళ్లు కలిసి పని చేశాం. గతంలో విద్యుత్‌ కోసం తెలంగాణ అనేక ఇబ్బందులు పడింది…

విద్యుత్‌ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్న మోత్కుపల్లికి ఆ కష్టాలు తెలుసు. స్వరాష్ట్రమే సమస్యలకు పరిష్కారం అని ఉద్యమం ప్రారంభించాను. స్వరాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నన్ను తిట్టినన్ని టిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదు. స్వరాష్ట్ర మద్దతు కోసం మాయావతిని 13 సార్లు కలిశాను. తెలంగాణలో ఇప్పుడిప్పుడే సమస్యలు కొలిక్కి వస్తున్నాయి. రైతులు, చేనేతల ఆత్మహత్యలు ఆగిపోయాయి. ముందుముందు మరింత చేయాల్సి ఉంది. అట్టడుగు వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని కేసీఆర్‌ అన్నారు..