మెద‌క్ ఎంపీగా కేసీఆర్‌ పోటీ..!?.

ఎంపీ సీట్ల‌లో ఎవరెవ‌రు పోటీ చేయాల‌నే దానిపై గులాబీ ద‌ళంలో క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. దాదాపు పాత ఎంపీలే పోటీ చేస్తార‌ని అంటున్నారు .అయితే మెద‌క్ ఎంపీగా ఎవ‌రు పోటీ చేస్తారు? అనేది ఓ హాట్ టాపిక్‌. ఇక్క‌డ నుంచి కేసీఆర్ లేదా హ‌రీష్‌రావు పోటీకి దిగే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది అంచ‌నా. క‌రీంన‌గ‌ర్ లేదా న‌ల్గొండ నుంచి కేసీఆర్ బ‌రిలో ఉంటార‌నేది ఇంకో టాక్‌. జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాలంటే ఎంపీగా అడుగుపెట్టాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌..!!

పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో బీఆర్ఎస్.. ఎంపీ నియోజకవర్గాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ భవన్‌లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించనున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్‌కి చెందిన నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరపనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో మెదక్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ పోటీ చేయకుంటే.. వేరే అభ్యర్థిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. వీటన్నింటిపై ఈ రోజు చర్చించనున్నారు…