ఈనెల 31న మూడు జిల్లాల్లో పర్యటించనున్న కేసీఆర్..!

..

జనగాం,సూర్యాపేట నల్గొండ జిల్లాలో కరువు ప్రాంతాలను పరిశీలించనున్న కేసీఆర్…

కరువు ప్రాంతాలను పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న కేసీఆర్…

రైతుల్లో ధైర్యం నింపేందుకు కేసీఆర్ జిల్లాల పర్యటన..

సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, మీకు మేము అండగా ఉంటామన్న భరోసా కల్పించనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, కేసీఆర్‌ మాత్రం రైతులకు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తుడవటమే అత్యంత ముఖ్యమని బీఆర్‌ఎస్‌ కార్యాచరణ నిరూపిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమై, చిక్కిశల్యమైపోయిన వ్యవసాయాన్ని పదేండ్ల కఠోర శ్రమతో దరికి చేర్చిన బాధ్యతాయుతమైన పార్టీగా, ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్న తెలంగాణ సాధకుడిగా.. కేసీఆర్‌ రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అందుకే జిల్లాల పర్యటన తలపెట్టారని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే రైతు కేంద్రంగా తాము పోరుపతాక ఎగురవేస్తున్నామని గులాబీదళం స్పష్టం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్‌ పార్టీ నిలుపుకోని కారణంగానే రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తున్నది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్‌ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే..