మాజీ సీఎం కేసీఆర్‌తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ..!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నంది నగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ ప్రతినిధుల బృందం..

పార్లమెంట్ ఎన్నికలకు ముహుర్తం దగ్గరపడుతున్న తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని నంది నగర్‌లో గల కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఉంది. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు హరీష్ రావు, బాల్క సుమన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల పొత్తులపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పొత్తు కుదిరితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉంది. కాగా డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోగా.. బీఎస్పీ ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓడిపోయారు.