కేరళలో మహిళ నరబలి.. తల నరికి నాలుక కోసి దారుణం..

కేరళలో నరబలి ఘటన కలకలం రేపుతోంది. మూఢ నమ్మకాల పేరుతో ఓ జంట ఇద్దరు మహిళలను కిడ్నాప్‌ చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణం పాతనంతిట్ట జిల్లా తిరువల్ల పట్టణంలోని ఎలంతూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ధనవంతులు అవ్వాలన్న ఆశతో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివరాలు.. ఎర్నాకుళం జిల్లాకు చెందిన రోస్లిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు జూన్‌, సెప్టెంబర్‌లో కనిపించకుండా పోయారు. పద్మ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఆమె హత్యకు గురైనట్లు తెలిసింది. బాధితుల ఫోన్‌లను ట్రేస్‌ చేయగా ఈ నరబలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎలంతూర్‌కు చెందిన నాటువైద్యుడు భగవల్ సింగ్, అతని భార్య లైలా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే నరబలి చేస్తే ఆర్థికంగా ఉన్నతవంతులవుతారని పెరుంబూర్‌కు చెందిన షఫీ అలియాస్‌ రషీద్‌ నమ్మించాడు.రు. దీంతో మహిళలను బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు మహిళలకు డబ్బు ఆశ చూపి కిడ్నాప్‌ చేసిన రషీద్‌ వారిని తిరువళ్లలోని నాటు వైద్యుడి ఇంటికి తీసుకొచ్చాడు. చేతబడి, క్షుద్ర పూజల పేరుతో వారిని అత్యంత క్రూరంగా హత్య చేశారు. మహిళల నాలుక కోసి, తల నరికి, శరీరాన్ని ముక్కలుగా చేసి మృతదేహాలను తిరువళ్ల పట్టణంలోగల తమ ఇంటి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టారు.మూఢ నమ్మకం ముసుగులో ఇద్దరిని బలి ఇచ్చిన ఘటనలో ముగ్గురిని అరెస్ఠ్‌ చేసినట్లు కొచ్చి పోలీస్‌ కమిషనర్ సీహెచ్‌ నాగరాజు మంగళవారం తెలిపారు. ఈ కేసులో నిందితుడు రషీద్‌ డబ్బు ఇప్పిస్తానని ఆశ చూపి రషీద్‌ మహిళలను నాటు వైద్యుడు వద్దకు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. చనిపోయిన ఇద్దరు మహిళలు లాటరీ టికెట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగించేవారని తెలిపారు. ఈ జంటను విచారించగా, జూన్‌లో కనిపించకుండా పోయిన రోసెలిన్‌ మహిళను కూడా అదే ఇంట్లో బలి తీసుకున్నట్లు అంగీకరించినట్లు తెలిపారు. ఇద్దరు మహిళలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అక్షరాస్యత ఎక్కువ గల కేరళలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విస్మయానికి గురిచేస్తుంది.