ఖమ్మం గడ్డపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభ…. రాహూల్ గాంధీ రూట్ మ్యాప్…! హస్తం గూటికి చేరనున్నా ముఖ్య నాయకులు వీరే..!!

ఖమ్మం: ఖమ్మం గడ్డపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ జనగర్జన సభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ సభ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో నూతనోత్తేజం వస్తుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 10 శాసనసభ నియోజకవర్గాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల నుంచి కార్యకర్తలు, ప్రజలను తరలించేలా ఆ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. సుమారు 40 ఎకరాల్లోని బహిరంగ సభాస్థలిలో వేదికను భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. సుమారు 50 అడుగుల ఎల్‌ఈడీ తెరను వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు రెండువైపులా రెండు చొప్పున భారీ ఎల్‌ఈడీ తెరలతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం చుట్టూ 15 ఎల్‌ఈడీ తెరలు అమర్చుతున్నారు. వేదికపై సుమారు 200 మంది ఆసీనులవుతారు. సభా ప్రాంగణం చుట్టూ పార్టీ ముఖ్యనేతల హోర్డింగులు, భారీ ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. వేదికకు సమీపంలోనే సుమారు 60 ఎకరాల్లో నియోజకవర్గాలవారీగా పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించారు. అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్‌ చేయనున్నారు. ఇల్లెందు, పాలేరు, పినపాక, ములుగు, డోర్నకల్‌, మహబూబాబాద్‌ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌కు రఘునాథపాలెం-ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ మధ్య రహదారి వెంట ఖాళీ స్థలాలను సిద్ధం చేశారు.

*విజయవాడ మీదుగా రానున్న రాహుల్‌*

రాహుల్‌గాంధీ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం 4.40 గంటలకు గన్నవరం (విజయవాడ) విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసిన భట్టి విక్రమార్కను ఆయన సన్మానిస్తారు. పొంగులేటికి కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మరికొందరు ముఖ్యనేతలు కూడా హస్తం గూటికి చేరనున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి రఘునాథ్‌యాదవ్‌, మహేశ్వరం- కొత్త మనోహర్‌రెడ్డి, పాలకుర్తి- హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సూర్యాపేట-పెద్దిరెడ్డి రాజా తదితరులు కూడా పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్న పొంగులేటి వర్గీయులు, భద్రాద్రి జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య, పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు భారాసకు శనివారం రాజీనామా చేశారు. సభ ముగిశాక రాహుల్‌గాంధీ రాత్రి 8.30 గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. దిల్లీ వెళతారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఒక ప్రకటనలో తెలిపారు…

*రాహుల్ రూట్ మ్యాప్*

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు. పీపుల్స్ మార్చ్ పేరుతో దాదాపు 109 రోజులు పాటు ఆయన ప్రజల్లో తిరిగారు. ప్రస్తుతం భట్టి చేపట్టిన పాదయాత్ర ఆదివారంతో ముగియనుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఈ సభకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇందుకోసం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతలు ఆయనను ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడ నుంచి రాహుల్ గాంధీ ఖమ్మం సభకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. కర్ణాటక మాదిరి తెలంగాణలోనూ ఆకట్టుకునే పథకాలను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. సభ ముగిసిన తర్వాత రాహుల్ తిరిగి పయనం అవుతారు. రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఇక రోడ్డు పొడవునా ప్రజలకు అభివాదం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అటు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం కలుస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాహుల్‌తో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. మరి తెలుగు రాష్ర్టాల్లో రాహుల్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.