లక్షల కోట్ల సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు: సీఎం కేసీఆర్…
ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం , భారత సమాజం లక్ష్యం ఏంటి.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. బిత్తరపోయి గత్తర పడుతుందా..
ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో.. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్‌గా ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు.దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి ..
ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి.. ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి.. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్ అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు…
అమెరికా మనకంటే రెండున్నర రెట్లు పెద్దగుంటది.. కానీ అక్కడున్న వ్యవసాయ భూమి 22 శాతమే. చైనా మనకంటే ఒకటిన్నర రెట్లు పెద్దగుంటది వాళ్లకున్న వ్యవసాయ భూమి 16 శాతం. భారత దేశం భూభాగం 83 కోట్ల ఎకరాలు.. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు అంటే సగం భూమి వ్యవసాయానికి అనుకూలం. అపారమైన జల సంపద లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తుంది. 70 వేల టీఎంసీలు ఆవిరైతే.. మనం ఉపయోగించుకునే నీరు 70-75వేల టీఎంసీల నీరు. భూమి ఉంది.. నీరు ఉంది.. పంటలు పండటానికి అవసరమైన సూర్యరశ్మి అద్భుతంగా కలిగి ఉన్న దేశం మనది. సముద్ర తీర ప్రాంతాలలో ఉండేటువంటి హ్యూమిడిటీ వాతావరణ కావొచ్చు.. సముద్ర తీరం లేనటువంటి.. మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు, పంజాబ్, హిమాచల్, కశ్మీర్ లాంటి శీతల రాష్ట్రాలు కావొచ్చు.. మూడు డిఫరెంట్ ఆగ్రోటిక్ జోన్స్ దేశంలో ఉన్నాయి” అని సీఎం కేసీఆర్ అన్నారు.
” భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్‌డోనాల్డ్ పిజ్జాలు.. మెక్‌డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి తెచ్చి దానికి కనెక్టెడ్‌గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టి.. అందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ ఆఫ్ వరల్డ్ గా ఉండాల్సినటువంటి.. భారత్ ఇవాళ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్నా సిగ్గు చేటు ఇంకేమైనా ఉంటదా? లక్ష కోట్ల రూపాయల విలువైన ఫామాయిల్‌ను దిగుమతి చేసుకుంటదా.. ఇంతకన్న సిగ్గు చేటు ఉంటదా” అని కేసీఆర్ అన్నారు.
ఖమ్మంలో ప్రతి గ్రామానికి రూ. 10 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 కోట్లు : సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మంలోని గ్రామ పంచాయతీలకు వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ప్రకటించారు.