తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌..ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ రాజీనామా..

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. గులాబీ పార్టీకి ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా ఆమె తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసని తనను కాదని,

ఆ ప్రాంతానికే సంబంధంలేని వ్యక్తికి టికెట్‌ ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు. కేవలం కేటీఆర్‌‌కు ఫ్రెండ్‌ కావడంతోనే జాన్సన్‌ నాయక్‌కు టికెట్‌ కేటాయించారని మండిపడ్డారు. అసలు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి.. ఎన్ని గ్రామాలున్నాయో కూడా తెలియని వ్యక్తికి టికెట్‌ ఎలా ఇస్తారని నిలదీశారు. జాన్సన్‌ నాయక్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనిచ్చే ఛాన్స్‌ లేదన్న రేఖానాయక్‌.. తాను ఒంటరిగానే పోటీ చేసి కచ్చితంగా గెలిచి తీరుతానన్నారు.
ఆ సమయంలో కంటతడి పెట్టారు… తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశానని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగానే ఆపేశారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. తన నియోజక వర్గ ప్రజలు అందరూ తనతోనే ఉన్నారని చెప్పారు.

కేటీఆర్ దోస్తు జాన్సన్ నాయక్ కోసం ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని రేఖా నాయక్ అన్నారు. ఈ నియోజక వర్గంలో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించేలా కృషిచేస్తానని చెప్పారు. తాను ఏదైనా స్కామ్, తప్పు చేసుంటే నిరూపించాలని సవాలు విసిరారు. ఎస్టీ నియోజక వర్గంలో క్రిస్టియన్ కి టికెట్ ఎలా కేటాయిస్తారని నిలదీశారు. కేసీఆర్ చేసిన వాగ్దానాలన్నీ వట్టి మాటలేనని అన్నారు.