బాలల సరదా జానపద కథ..

*ఠింగురుబిళ్ళ
(బాలల సరదా జానపద కథ).
*******************************
ఒకూర్లో ఒక పిల్లోడుండేటోడు. వానికి చిన్నప్పుడే అమ్మానాన్నా చచ్చిపోయినారు. దాంతో తల్లీదండ్రీ లేని పిల్లోడు గదా అని వాళ్ళవ్వ వాన్ని ప్రేమగా, గారాబంగా పెంచింది. వాడు ఏమడిగితే అది ఇట్లా అడగడం ఆలస్యం అట్లా కొనిచ్చేది. రోజుకోరకం తినుబండారాలు చేసి పెట్టేది. దాంతో వాడు అవన్నీ తినీ తినీ బాగా లావెక్కినాడు.

ఒకరోజు పొద్దున్నే అవ్వ వానికి తలస్నానం చేపిచ్చి, కొత్త బట్టలేపిచ్చి, సుబ్బరంగ తల దువ్వి, చక్కగా పాపిడిదీసి, నుదుట కుంకుమ బొట్టు పెట్టి, పలకా బలపం చేతికిచ్చి ‘ఒరే నాయనా… నువ్వు బాగా సదువుకోని పెద్ద వైద్యునివి కావాలరా” అని దీవించి బడిలో చేర్పించింది.

వాడు బాగా లావు గదా… దాంతో బళ్ళో పిల్లోల్లందరూ వాన్ని చూస్తానే ”ఏయ్‌ దుబ్బోడొచ్చ… ఏయ్‌ దుబ్బోడొచ్చ” అంటా ఒగటే ఎగతాళి చేయసాగినారు. అట్లా వూరికెనే ఎవరయినా మనల్ని ఎక్కిరిస్తా మనకేడుపు వస్తాది గదా… పాపం వానికి గూడా బాధేసి కండ్ల నిండా నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా మట్టసంగా ఇంటికి తిరిగి వచ్చేసినాడు.

అవ్వ వాన్ని దగ్గరికి తీసుకోని బుజ్జగిస్తా ”ఏరా ఎందుకట్లా వెక్కివెక్కి ఏడుస్తా వున్నావ్‌… ఏంది నీ బాధ” అనడిగింది. దానికి వాడు కండ్ల నిండా నీళ్ళు కారిపోతా వుంటే తుడుచుకుంటా ”అవ్వా… అవ్వా… నేనింక ఆ బడికి పోనే… అందరూ దుబ్బోడు… దుబ్బోడని వూకూకెనే ఎక్కిరిస్తా వున్నారే” అన్నాడు. అవ్వ చీరచెంగుతో వాని కండ్లనీళ్ళు తుడుస్తా ”ఈసారి నిన్నెవరయినా అట్లా అంటే వెంటనే ఠింగురుబిళ్ళ అను… ఏం జరుగుతా వుందో నువ్వే చూద్దువు గానీ” అనింది.

సరేనని వాడు పలకాబలపం తీసుకోని మళ్ళా బడికి పోయినాడు. వాన్ని చూస్తానే పిల్లలందరూ కిందామీదాపడి నవ్వుతా ”రేయ్‌… దుబ్బోడు మళ్ళా బడికొచ్చినాడ్రోయ్‌… మీమీ సద్దన్నం మూటలు జాగ్రత్తరోయ్‌” అంటా ఒగటే ఎగతాళి చేయసాగినారు. వాళ్ళట్లా ఎగతాళి చేస్తా వుంటే వాని కండ్లల్లో నీళ్ళు తిరిగినాయ్‌. అంతలో వానికి అవ్వ చెప్పినేది గుర్తుకొచ్చింది. వెంటనే అందరినీ కోపంగా చూస్తా ‘మీకందరికీ ఠింగురుబిళ్ళ” అని గట్టిగా ఒక్కరుపు అరిచినాడు.

అంతే… యాడున్నోళ్ళు ఆపూకప దభీమని కిందపడి చచ్చిపోయినారు.

కాసేపటికి వాళ్ళ అయ్యవారు పాఠం చెప్పడానికి బడిలోకి వచ్చినాడు. వచ్చి చూస్తే ఇంగేముంది… వీడు తప్ప అందరూ చచ్చిపడున్నారు. ”ఏందిరా… ఏమయిందిరా వీళ్ళకి… అందరూ ఇట్లా చచ్చిపడున్నారు” అని అడిగినాడు. వాడు జరిగిందంతా చెప్పినాడు. దాంతో అయ్యోరుకి కోపమొచ్చి కట్టె తీసుకోని ”యెంత పని చేసినావురా దుబ్బోడా… వుండు నీ పని చెబ్తా’ అంటూ కిందా మీదా యేసి కొట్టినాడు. అయ్యోరు గూడా దుబ్బోడంటూ కొట్టేసరికి వానికి చానా కోపమొచ్చేసి ‘అయ్యోరుకి ఠింగురుబిళ్ళ’ అన్నాడు.

అంతే… అయ్యోరు కుర్చీ మీద నుండి దభీమని కిందపడి చచ్చిపోయినాడు.

బళ్ళో పిల్లోలెవరూ లేరు. అయ్యోరుగూడా లేడు. ఇంక ఆడ కూచోని ఏం చేయాల. దాంతో వాడు తిరిగి ఇంటికొచ్చేసినాడు. అంత తొందరగా తిరిగొచ్చిన మనవన్ని చూసి అవ్వ కోపంగా ”ఏరా… నీకేం పోయేకాలమొచ్చిందిరా… బడికి పోయి అయిదు నిమిషాలు గూడా కాలేదు… అప్పుడే సంచెత్తుకోని తిరిగొచ్చేసినావ్‌. తినీ తినీ నీకు ఒళ్ళు పెరిగిందేగానీ బుద్ధి పెరగలేదు… దుబ్బనాయాలా” అని తిట్టింది. అవ్వగూడా తనని దుబ్బోడని తిట్టేసరికి వానికి చానా కోపమొచ్చేసింది. వెంటనే ”అవ్వకి ఠింగురుబిళ్ళ” అన్నాడు.

అంతే… అవ్వ వున్నదున్నట్లు ఠపీమని కిందపడి చచ్చిపోయింది.

ఒక్కడే ఇంట్లో కూచోలేక చానాసేపు అటూ యిటూ తిరిగినాడు. కాసేపటికి ఆకలైంది. తినడానికి ఇంట్లో ఏమీ లేదు. చెయ్యడానికి అవ్వగూడా లేదు. ఆడుకుందామా అంటే పిల్లోలెవరూ లేరు. బడికి పోదామా అంటే సారు లేడు. దాంతో వానికి ఏం చేయాల్నో అర్థం కాలేదు. దిగులుగా కూచున్నాడు. అంతలో ఎదురుగా అద్దం కనబడింది. దాంట్లోకి తొంగి చూసినాడు. వాని బొమ్మ వానికే లావుగా వెక్కిరిస్తున్నట్లుగా కనబడింది. వెంటనే కోపంగా అద్దంలోకి వేలు చూసిస్తా ”నీకు ఠింగురుబిళ్ళ” అన్నాడు.

అంతే… పాపం… వాడు గూడా కిందపడి చచ్చిపోయినాడు.
************