కిడ్నీ పరిశోధన కేంద్రం పరిధిలో ఓ అరుదైన సంఘటన.కిడ్నీ వ్యాధిని జయించి ఆస్పత్రి వైద్యులను ఆశ్చర్యపరిచాడు.!.

పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం పరిధిలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సీరం క్రియాటినిన్‌ లెవెల్‌ పది పాయింట్లు దాటి డయాలసిస్‌ చేయాల్సిన ఓ కిడ్నీ వ్యాధి బాధితుడికి డయాలసిస్‌ అవసరమే లేకుండా రెండు నెలల్లోనే సీరం క్రియాటినిన్‌ లెవెళ్లు రెండున్నరకు దిగిపోయాయి. బతకడం కష్టమే అనుకున్న దశ నుంచి ఆ వ్యక్తి సాధారణ స్థితికి వచ్చాడు. కిడ్నీ వ్యాధిని జయించి ఆస్పత్రి వైద్యులను ఆశ్చర్యపరిచాడు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామానికి చెందిన ఉంగ అప్పలస్వామి(48)ని రెండున్నర నెలల కిందట కడుపు ఉబ్బిపోయి, కాళ్లు, చేతులు, ముఖం పొంగిపోయి రెండు మూడు రోజుల్లో మరణిస్తాడనే మాటలతో పలాస కిడ్నీ పరిశోధన కేంద్రానికి తీసుకువచ్చారు. అన్ని పరీక్షలు చేశాక రెండు కిడ్నీలు పాడైపోయిన దశలో ఉన్నాయని ఏప్రిల్‌ 12న వైద్యులు నిర్ధారించారు. సీరం క్రియాటినిన్‌ 10.02 పాయింట్లు ఉందని, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నావని డయాలసిస్‌ చేసుకోవాలని అతనికి సూచించారు…డయాలసిస్‌ చేయించుకోవడానికి ఇష్టపడని అప్పలస్వామి వైద్యులు ఇచ్చిన ఉచిత మందులతో ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుంచి రెండు పూటలు చప్పటి ఇడ్లీలు, మధ్యాహ్నం చప్పటి పప్పుతో కూడిన భోజనం తీసుకున్నాడు. మూడు పూటలు భోజనానికి ముందు, తర్వాత కలిపి 23 రకాల మాత్రలు వేసుకున్నాడు. అలా సుమారు రెండు నెలలు ఆహార నియమం పాటించాడు. మధ్యలో ఏప్రిల్‌ 19న ఆస్పత్రికి మందులకు వెళ్లినప్పుడు పరీక్షిస్తే సీరం క్రియాటినిన్‌ 8.04కు వచ్చింది.

ఆ తర్వాత మళ్లీ జూన్‌ 18వ తేదీన పరీక్ష చేయించుకుంటే 2.7 గా సీరం క్రియేటిన్‌ నమోదైంది. పల్లె ఆహార అలవాట్లే తనను కాపాడాయని, పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ కిడ్నీ పరిశోధన కేంద్రంలోనే వైద్య సేవలు పొందానని అప్పలస్వామి ఆనందంగా చెప్పాడు..ఈ ప్రత్యేకమైన కేస్‌కు సంబంధించి పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం కిడ్నీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ యర్ర రాకేష్ ను వివరణ కోరగా కిడ్నీ వ్యాధి సోకినపుడు ఆయా శరీర తత్వాలను బట్టి వారిలో మార్పులు వస్తాయని తెలిపారు. అనేక మంది చనిపోతారని, ఆహార అలవాట్లతో కొందరు నెగ్గుకురాగలరని వివరించారు. కిడ్నీ వ్యాధి బాధితునికి పూర్తిగా నయం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు..