దరఖాస్తులు అవసరం లేకుండానే 6 గ్యారంటీలు అమలు చేయవచ్చు: కిషన్‌ రెడ్డి.

రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం దరఖాస్తులంటూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు ఫారం వెనుక మతలబు ఏంటో అర్థం కావడం లేదన్నారు. అభయ హస్తం దరఖాస్తుల వెనుక పూర్తిగా రాజకీయ ప్రయోజనం కోణంలోనే కనిపిస్తున్నది తప్ప.. ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా లేదని అనుమానం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేయకపోతే ప్రభుత్వ సాయం అందదని ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దరఖాస్తులు అవసరం లేకుండానే ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేయవచ్చని అన్నారు.

కాలయాపన చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశమని కిషన్‌ రెడ్డి విమర్శించారు. రేషన్‌ కార్డుదారులు, ఉద్యమకారులు, జైలుకు వెళ్లిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని గుర్తు చేశారు. అనవసరంగా ప్రజలను మరోసారి కార్యాలయాల చుట్టూ, జైళ్ల చుట్టూ, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఇస్తారా.. లేక అందరికీ ఇస్తారా అనేది స్పష్టత లేదన్నారు.

ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగనున్నదని కిషన్‌రెడ్డి అన్నారు. అన్ని దేవాలయాలయాల్లో కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయోధ్య భవ్య రామాలయం భారత సంస్కృతికి చిహ్నమని, హిందువుల అచంచల విశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు దేశంలోని పుణ్యస్థలాలు, దేవాలయాల ప్రాంగణాల్లో స్వచ్ఛతా అభియాన్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. శ్రమదానం చేసి అన్ని ఆలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. 22న ఇంటింటా ముగ్గులు, పచ్చతోరణాలతో అలంకరించడంతో పాటు 5 శ్రీరామజ్యోతులను వెలిగించాలని కోరారు.