కోడి కథ అనుకున్నదొక్కటి అయిందొకటి…

ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతమైంది. ఈ నెల 9న ఆర్టీసీ బస్సు లో డిపో-2 సెక్యూరిటీ గార్డుల తనిఖీలో పందెం కోడి దొరికిన విషయం తెలిసిందే.

మూడు రోజుల పాటు సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణ ఉన్న కోడిని శుక్రవారం డిపో-2 మేనేజర్‌ మల్లయ్య ఆధ్వర్యంలో ప్రముఖ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ బ్లూక్రాస్ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు తూము నారాయణకు అప్పగించారు.

అయితే పందెం కోడిని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ జంతు సంరక్షణ సంస్థ సభ్యులు కొంత మంది వచ్చి వన్యప్రాణుల చట్టం ప్రకారం కోడిని వేలం వేయరాదని, జంతు సంరక్షణ కేంద్రాలను అప్పగించాలని ఆర్‌ఎం సుచరిత దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఉన్నతాధికారులతో చర్చల అనంతరం ఆమె ఆదేశాల మేరకు బ్లూ క్రాస్‌ సొసైటీ సంస్థకు కోడిని అప్పగించారు. అయితే అప్పటికే వేలం ప్రకటన చూసి పలువురు డిపో-2కు చేరుకున్నారు.

బ్రీడింగ్‌ కోసం పందెం కోడిని దక్కించుకునేందుకు రామకృష్ణ అనే వ్యక్తి మహదేవపూర్‌ నుంచి వచ్చాడు. రూ.25వేల వరకైనా వేలం పాడాలని నిర్ణంచుకొని వచ్చానని చెప్పాడు.

అతనే కాకుండా నగరంలోని రెస్టారెంట్లు, హోటల్స్‌ యాజమానులు తరలి వచ్చారు. చివరకు బ్లూక్రాస్‌ సంస్థకు అప్పగించడంతో నిరాశగా వెనుది రిగారు.

కాగా, కోడిని హైదరాబాద్‌ మాదాపూర్‌ బ్లూ క్రాస్‌ సంస్థ కేంద్రానికి తరలిస్తామని సంస్థ జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు..