క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందంటూ సీఎం కేసీఆర్ ఆధారాలు ఉంటే బయట పెట్టాలి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి..

క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగిందంటూ సీఎం కేసీఆర్ ఆధారాలు లేకుండా మాట్లాడారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఫ్రూఫ్లు ఉంటే ముఖ్యమంత్రి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే అందరికీ క్లారిటీ వస్తుందని అన్నారు. క్లౌడ్ బరస్ట్ ఏ సందర్భంలో జరుగుతుందో వివరించిన విశ్వేశ్వర్ రెడ్డి.. సీఎం వ్యాఖ్యలకు అందరూ నవ్వుతున్నారని అన్నారు. ఆ కుట్ర పాకిస్థాన్ వాళ్లు చేశారా లేక చైనా వాళ్లు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాకెట్స్, విమానం ద్వారా క్లౌడ్ బరస్ట్ చేయాలంటే వాళ్లకు భారత్ లో సీక్రెట్ ఎయిర్ బేస్ ఉండాలని అదెక్కడ ఉందో సీఎం కేసీఆర్ చెప్పాలని అన్నారు.
క్లౌడ్ బరస్ట్ కు ఉపయోగించిన ఎయిర్బేస్ గజ్వేల్ లోనే ఉండి ఉంటందని కొండా విశ్వేశ్వర రెడ్డి సటైర్ వేశారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటి కైనా క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో తెలుసుకొని చెప్పాలని సూచించారు. లద్ధాఖ్ లో అది సాధ్యమే అయినా నిజంగా అక్కడ జరిగిందా లేదా అన్నది తనకు తెలియదని కొండా చెప్పారు. కాళేశ్వరంతో ఫ్లడ్ కంట్రోల్ అవుతుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆ ప్రాజెక్టు డిజైన్ చేసిన విధానం కరెక్ట్ కాదని తేలిపోయిందని, మూడేళ్లు కాకముందే కొండ పోచమ్మ లీకేజీ అవుతోందని విమర్శించారు.