వచ్చేనెల15న తెరాస పార్టీ అధ్వర్యంలో వరంగల్ లో లక్షల మందితో గర్జన బహిరంగ సభ..టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడి..

ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ
సర్వసభ్య సమావేశం, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక
గర్జన సభ తర్వాత జిల్లా పార్టీ ఆఫీసుల ప్రారంభం
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడి..
హైదరాబాద్‌..
R9TELUGUNEWS.com.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ‘ద్విదశాబ్ది ఉత్సవాలు’ నిర్వహించనున్నట్టు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్‌ 15న వరంగల్‌ వేదికగా ‘తెలంగాణ విజయ గర్జన’ పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ రెండు దశాబ్దాల ప్రస్థానం, కార్యకర్తల శ్రమను గుర్తు చేసుకోవడంతోపాటు, ప్రజల ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టి, సాధించిన విజయాలను మరోసారి దేశానికి చాటి చెప్తామన్నారు. అంతకు ముందే.. ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహించనున్నట్టు తెలిపారు. అధ్యక్ష ఎన్నికపై ప్లీనరీలో అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను, చాలెంజ్‌లను అధిగమించి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో రాజకీయ శక్తిగా ఎదిగింద న్నారు. ‘కేసీఆర్‌ నేతృత్వంలో దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణను ఎలా సాధించుకున్నామో అందరికీ తెలుసు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు 2014లో అధికారాన్ని అప్పగించారు. అప్పటి నుంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని కలెగలిపి జోడెడ్లలా జనరంజక పాలన అందించాం,ఫలితంగా 2018లో మళ్లీ భారీ మెజారిటీతో రెండోసారి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలని దీవించారు’ అని పేర్కొన్నారు.