ఈటెల, రేవంత్ గోల్కొండలో భేటీ. కాదని చెప్పండి.. ఫొటోలిస్తా: కేటీఆర్‌.

ఈటెల రేవంత్ గోల్కొండలో భేటీ.
కాదని చెప్పండి.. ఫొటోలిస్తా: కేటీఆర్‌

కాంగ్రెస్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు
టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు
త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న ఈటల
రిసార్ట్‌లో ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం
జాతీయ పార్టీలకు కోతీయ అధ్యక్షులు
ఈటలకు పార్టీ చేసిన అన్యాయమేంటి?
వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా పదవిలోనే
జీజేపీలో చేరికతో రాజేందర్‌ ఆత్మవంచన
ప్రాజెక్టులకు అసైన్డ్‌ భూముల సేకరణ తన ఫౌల్ట్రీ అసైన్డ్‌ కబ్జా ఒకటేనా?
ధ్వజమెత్తిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్
.
రేవంత్‌.. ఈటల.. గోల్కొండ రిసార్ట్‌
హుజూరాబాద్‌ ఫలితం ఎలా ఉన్నా ఈటల రాజేందర్‌ మరో ఏడాది, ఏడాదిన్నరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయం. ఈ ఒప్పందం ముందే జరిగిపోయింది. గోల్కొండ రిసార్ట్‌లో ఈటల రాజేందర్‌, రేవంత్‌రెడ్డి రహస్యంగా కలుసుకొని చర్చలు జరిపారు. ఇది నిజం కాదా? ఒకవేళ నిజం కాదని వారు అంటే ఆధారంగా నా దగ్గర ఫొటోలు కూడా ఉన్నాయి. వాటిని తగిన సమయంలో బయటపెడుతా…

గాంధీ భవన్‌లోకి గాడ్సే దూరిండు..
ఇది నా మాట కాదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్వయంగా అన్న మాట.

ఇదీ పరిస్థితి!
మహారాష్ట్రలో సీఎంను చెంప పగులగొడుతా అంటే కేంద్ర మంత్రిని జైల్లో పెట్టిన్రు. ఏపీలో సీఎంను తిడితే పొల్లు పొల్లు చేశిన్రు. మన రాష్ట్రంలో మాత్రం 420 గాళ్లు సీఎం కేసీఆర్‌ను పట్టుకొని మాట్లాడుతున్నరు.

ఇదేం కోడ్‌.. ఈసీ?
ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మాత్రమే ఉండాల్సిన ప్రవర్తనా నియమావళిని ఈసీ ఈ సారి సరిహద్దు జిల్లాకు విస్తరించింది. రాబోయే రోజుల్లో దాన్ని సరిహద్దు రాష్ర్టాలకు విస్తరిస్తుందోఏమో. కేసీఆర్‌ ప్రచారానికి వస్తే డిపాజిట్‌ కూడా రాదని బీజేపీకి భయం పట్టుకుంది. అందుకే ఈసీతో ఇలా చేయించింది.

ఈటలకు టీఆర్‌ఎస్‌ చేసిన అన్యాయం ఏమిటి?.

పార్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి వెళ్లిపోయేదాకా పదవిలోనే ఉన్నారు. పార్టీలో అడుగు పెట్టగానే ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఎల్పీ లీడర్‌గా చేశారు. ఏడేండ్లుగా మంత్రిగా కొనసాగారు. అన్నం పెట్టిన కేసీఆర్‌కు.. అన్నలాంటి కేసీఆర్‌కు అన్యాయం చేసి.. రాజకీయంగా జన్మనిచ్చిన టీఆర్‌ఎస్‌ను బొంద పెడుతా అంటవా? ఈటలా.. ఇదా నీ గౌరవం? నీ విజ్ఞత.
కేసీఆర్‌ పిలిస్తే పోను, ఫోన్‌ చేస్తే పలుకను.. అన్నడు ఈటల. తప్పు చేయకుంటే వెళ్లి ముఖ్యమంత్రికి చెప్పడం ధర్మం కాదా? ఒక మంత్రి సఖ్యంగా ఉండకపోతే సీఎంకు బర్తరఫ్‌ తప్ప ఇంకా ఏ ఆప్షన్‌ ఉంటుంది?

ఈటల బీజేపీలో చేరి ఆత్మ వంచన చేసుకున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు హుజూరాబాద్‌ సాక్షిగా నల్ల చట్టాలన్నారు. బీజేపీలో చేరగానే తెల్ల చట్టాలయ్యాయా?

నీ డైలాగులకు భయపడం
కేసుల చిట్టా ఉందని బండి సంజయ్‌ బెదిరిస్తున్నారు. 20 ఏండ్లుగా పార్టీని నడుపుతున్నాం. ఏడేండ్లుగా అధికారంలో ఉన్నాం. ఈ డైలాగులకు భయపడేటోళ్లు ఎవరూ లేరిక్కడ. దేన్నయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వాళ్లు ఎట్లా ప్రవర్తిస్తున్నరో దేశం మొత్తం చూస్తున్నది. ఎవరి చిట్టా ఉంది? ఈటల రాజేందర్‌ అక్రమాస్తులవా? తీన్మార్‌ మల్లన్న కేసుల చిట్టానా? ధర్మపురి అర్వింద్‌ ఫేక్‌ డిగ్రీలవా? అయినా నువ్వేమన్నా చిత్రగుప్తుడివా చిట్టా రాసుకుంటూ కూర్చోవడానికి?..ఈటల రాజేందర్‌ త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే గోల్కొండ రిసార్ట్‌లో ఈటల, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య ఒప్పందం జరిగిందని చెప్పారు. ఒకవేళ నిజం కాదని వారు అంటే ఆధారంగా తన దగ్గర ఫొటోలు కూడా ఉన్నాయని, వాటిని బయటపెడుతానని అన్నారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకొని, ‘ఉమ్మడి అభ్యర్థి’గా ఈటల రాజేందర్‌ను నిలబెట్టాయని కేటీఆర్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను నిలువరించాలనే ఏకైక లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ‘ఓట్‌ ట్రాన్స్‌ఫర్‌’ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. గతంలో కరీంనగర్‌, నిజామాబాద్‌, నాగార్జునసాగర్‌లో ఇదే జరిగిందని చెప్పారు. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఎగిరెగిరి పడుతున్నారని, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నేపథ్యంలో నమస్తే తెలంగాణకు కేటీఆర్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.