వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి!..కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపండి!

కార్పొరేట్ లకు కట్టబెట్టే పన్నాగాలు మానండి!

కేంద్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ

వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తుందన్న కేటీఆర్

తన కార్పొరేట్ మిత్రులకు 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ప్రధానమంత్రి మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల ఇదే ఔదార్యం ఎందుకు లేదని ప్రశ్నించిన కేటీఆర్

కేంద్రమే ఈ వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలి

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీలీనాన్ని పరిశీలించాలి

కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం ఐదువేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు.

గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చింది

లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో చేసుకోబోయే ఒప్పందం విషయంలో ఎలాంటి నిర్దిష్ట నిబంధనలు లేవు

ఇది ముడి సరుకులకు మూలధనం పేరిట స్టీల్ ప్లాంట్ ని తమ అనుకూల ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్ర

వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కు… దీని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత

భారత రాష్ట్ర సమితి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆంధ్రప్రదేశ్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ గారికి సూచన

కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ఆపేందుకు లక్షలాది PSUల కార్మికులు బిఆర్ఎస్ తో కలిసి రావాలని విజ్ఞప్తి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని రాష్ట్ర మంత్రి కేటిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేయాలన్న కుట్రలను ఎప్పటికప్పుడు అక్కడి కార్మికులు, అనేక ఇతర సంఘాలు, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలు అడ్డుకుంటున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మంత్రి మరోసారి కుండబద్దలు కొట్టారు. కేవలం కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ తన ఎజెండా అమలు కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ ను క్రమంగా చంపే ప్రయత్నం ఎప్పటినుంచో చేస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందని కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు. స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నదన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో భారీ ఎత్తున సిమెంట్ ను ఉత్పత్తి చేసిన పరిశ్రమలన్నింటిని పూర్తిగా ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని ప్రభుత్వాలు, ప్రస్తుతం స్టీల్ పరిశ్రమను కూడా అదే రీతిన ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇందులో భాగంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని తెలిపారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40% లోపలనే ఉన్నదని చెప్పారు. పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని, మార్కెట్ లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు. మరోవైపు పూర్తిస్థాయిలో కోకింగ్ కోల్ విదేశాల నుంచే తీసుకురావాల్సిన పరిస్ధితి ఉండడం, స్టీల్ ప్రొడక్షన్ కి అవసరమైన ఐరన్ ముడి సరుకును సైతం ఎన్ఎండిసి నుంచే మార్కెట్ రేట్ కే కొనుగోలు చేయాల్సి రావడం వలన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. దీంతో ఒక ఏడాది కాలంగా సగానికి పైగా ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చిందని, ఇదంతా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లోకి నెట్టి, ఆ నష్టాలను సాకుగా చూపించి, ప్రైవేట్ పరం చేయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతుందని కెటియార్ హెచ్చరించారు. నష్టాలను సాకుగా చూపించి తన కార్పొరేట్ కంపెనీల మిత్రులకు 12.5 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసిన ప్రధానమంత్రి మోడీకి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 7.3 ఎంటిపిఏ కెపాసిటీ ఉన్నా, కేవలం ముడి సరుకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం కెపాసిటికి కూడా 100 శాతం కెపాసిటి ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని మంత్రి చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తే 100% కెపాసిటీతో పని చేయడం వల్ల అనేక ఖర్చులు కలిసి వచ్చి స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందని స్పష్టంచేశారు. ఇప్పటికైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ కాపిటల్ పేరుతో ప్రైవేట్ కంపెనీలతో కలిపే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలని సూచించారు. దీని బదులు కేంద్ర ప్రభుత్వమే అందుబాటులో ఉన్న ఇతర మార్గాల ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను బలోపేతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దాదాపు లక్ష కోట్ల రూపాయలతో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించిందని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్డ్ లో భారీ విస్తృత ప్రణాళిక ప్రకటించిన ఈ సంస్థను వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో కలపవచ్చని సూచించారు. దీంతో తక్కువ ధరకి ప్రైవేట్ సంస్ధలకు అమ్మడం కంటే కేంద్ర ప్రభుత్వమే ఇంకో ప్రభుత్వ రంగ సంస్థతో కలపడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సేయిల్ సంస్థ విస్తరణ లక్ష్యానికి కూడా ఇది ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. సేయిల్ సంస్థ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్ తో పాటు కడపలోను మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకో సిస్టం ఏర్పడుతుందన్నారు. పైగా దేశ మౌళిక రంగానికి అవసరమైన స్టీల్ సరఫరా భద్రత ప్రయివేట్ కంపెనీల దాయాదాక్షిణ్యాల మీద అధారపడాల్సిన అవసరం ఉండదని సూచించారు.

దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం దాదాపు 25వేల కోట్ల వరకు మాత్రమే రుణాల మానిటైజేషన్ చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని తెలిపారు. అయితే అదే స్థాయిలో ఆస్తులు లేదా విలువ కలిగిన ప్రైవేట్ కంపెనీలకు మాత్రం దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల రూపాయల వరకు రుణాలను పొందగలిగే సౌకర్యాన్ని కేంద్రం కల్పించిందన్నారు. ప్రయివేట్ కంపెనీలతో సమానంగా కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యాన్ని కల్పించి, బ్యాంకుల ద్వారా మరింత మూలధనాన్ని ఇప్పిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన కార్యకలాపాలను ప్రైవేటు కంపెనీలతో సమానంగా పోటీపడేలా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చొరవ చూపాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం ఐదువేల కోట్ల రూపాయలను కేటాయించాలని సూచించారు. గతంలో ప్రధాన మంత్రులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయ్ ల హయాంలో ఇదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నిధులను నేరుగా కేటాయించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోరుతున్నట్టు.. సుమారు 5000 కోట్ల రూపాయలను కేటాయించి, అందుకు సరిపడా ఈక్విటీని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చన్నారు. 2003లో అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రభుత్వం ఇచ్చిన నగదును తిరిగి 2008లో వడ్డీతో సహా వైజాగ్ స్టీల్ ప్లాంట్ చెల్లించిన అంశాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి గుర్తు చేశారు.
ప్రస్తుతం మూలధనం అందించి స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ నోటీసు) వెంటనే కేంద్రం రద్దు చేయాలన్నారు. దీని బదులు కేంద్ర ప్రభుత్వమే దేశంలో భారీ ఎత్తున చేపడుతున్నామని చెప్పుకుంటున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి నేరుగా స్టీల్ ని కొనుగోలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ సొమ్ములను అందించి, స్టీల్ కోనుగోలు చేస్తే సరిపోతుందన్నారు. ఇవేవి కాకుండా కేవలం ప్రైవేట్ కంపెనీలను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోకి ప్రవేశపెట్టాలన్న దురుద్దేశంతో ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కనీసం ఇందులో ఎర్పాటు చేసుకోబోయే ఒప్పందం తాలుకు నిర్దిష్ట నిబందనలు సైతం పెర్కోనలేదని, ఇది కేవలం ఈ మధ్యనే భారీగా తన సంపద కోల్పోయి, ప్రపంచ ఆర్థిక కుబేరుడి జాబితాలో స్ధానం పడిపోయిన తమ మిత్రుని కంపెనీతో తగిన విధంగా ఒప్పందం చేసుకునేందుకు ఈ అంశంలో స్పష్టతను కేంద్రం ఇవ్వలేదన్నారు.

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మివేయడమే ఏకైక ఎజెండాగా పనిచేస్తుందని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జాతికి తీరని నష్టాన్ని కలిగించిందన్నారు. ఒకప్పుడు దేశ అభివృద్ధిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ సంస్థలను, కేవలం నష్టాలను సాకుగా చూపించి ప్రైవేట్ పరం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ, ప్రస్తుతం లాభాలతో నడుస్తున్న నవరత్నాలాంటి కంపెనీలను కూడా అమ్మేసే కుట్రలకు తెగబడుతున్నారన్నారు. లాభాలను ప్రవేట్ పరం చేస్తూ, నష్టాలను జాతీయం చేస్తున్నారని ప్రధానమంత్రి మోడీ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనం చేస్తూ దేశానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయాలన్నారు.

భారత్ రాష్ట్ర సమితి ఒక పార్టీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్న చిత్తశుద్ది తమకు ఉన్నదని మంత్రి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా తమ అనుకూల ప్రైవేట్ కంపెనీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అప్పజెప్పాలన్న కుట్రను చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీన్ని ఎదుర్కొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కొన్ని స్వార్థపూరిత శక్తులు, వారి ఎజెండాలకు బలి కావొద్దని, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని అంగీకరించబోమని మంత్రి కుండబద్దలు కొట్టారు. కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతోనే కేంద్రం కుట్రలు ఆగదని, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను భారీ ఎత్తున తెగనమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, బిఎస్ఎన్ఎల్, సింగరేణి వంటి ఇతర పబ్లిక్ సెక్టార్ రంగ సంస్థలు కూడా అంతిమంగా ప్రవేట్ కంపెనీల చేతులలోకి పోయేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలాదిమంది కార్మికుల శ్రేయస్సు కోసం వారితో కలిసి నడిచేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంటుందని, ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం లేపిన ఈ సరికొత్త కుట్రను ఎదుర్కొనేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కు కేటీఆర్ సూచించారు.