ఎక్కడైనా నేను లైడిటెక్టర్‌ పరీక్షకు రెడీ. ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో? దొరెవరో? తేలిపోతుంది… కెటిఆర్..

రేవంత్‌రెడ్డీ..జూబ్లీహిల్స్‌లోని నీ ప్యాలెస్‌లో అయినా సరే.. ఈడీ ఆఫీస్‌లో అయినా సరే.. న్యాయమూర్తి ఇంట్లోనైనా సరే.. ఎక్కడైనా నేను లైడిటెక్టర్‌ పరీక్షకు రెడీ. ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో? దొరెవరో? తేలిపోతుంది. ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. డేట్‌, టైమ్‌, ప్లేస్‌ నువ్వే చెప్పు’ అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ బహిరంగంగా సవాల్‌ విసిరారు. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌కు సంబంధించి గురువారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.35 గంటల తర్వాత కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. సుమారు 8 గంటల విచారణ అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను ఈడీ విచారణకు వచ్చానని, రాజకీయ వేధింపు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తన మీద అక్రమ కేసు పెట్టిందని చెప్పారు. విచారణ అధికారులు, విచారణ సంస్థలను గౌరవించి మొన్న 9వ తేదీన ఏసీబీ విచారణకు హాజరయ్యానని, ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి 16న ఈడీ విచారణకు రమ్మని పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యానని తెలిపారు. ఆ రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలను ఏడు నుంచి 8 గంటలపాటు అడిగిందే అడిగి వివరాలు తీసుకున్నాయని చెప్పారు…