ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాం.. కేటీఆర్..
డీలిమిటేషన్ అనేది ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారు
ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రక్రియను మేము స్వాగతిస్తున్నాం
కానీ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదు
కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రక్రియను కట్టుదిట్టంగా పాటించాయి
ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది – కేటీఆర్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిగ్‌బాస్‌లా కాకుండా బిగ్ బ్రదర్‌లా వ్యవహరించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బిగ్‌బాస్‌లాగా చిన్న రాష్ర్టాలను, దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం చెలాయించకూడదని సూచించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆదివారం నిర్వహించిన జర్నలిజం టాక్ షోలో కేటీఆర్ మాట్లాడారు. జర్నలిస్టు మారియాతో సుమారు అర్ధగంటపాటు జరిగిన టాక్ షోలో కేటీఆర్ అనేక అంశాలను ప్రస్తావించారు..
వలస కార్మికులను కేసీఆర్ సొంత బిడ్డల్లా చూసుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. 2020-21 కొవిడ్ కాలంలో యూపీ, రాజస్థాన్‌తోటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేసి స్వస్థలాలకు పంపించారని చెప్పారు. దేశంలో ఇలా పంపించిన తొలి ముఖ్యంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.
హిందీ బెల్ట్ లీడ్ చేసే పరిస్థితి
పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ జనాభా పరంగా కావద్దని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు నాడు దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణ పాటించాయని.. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలు ఇప్పుడు జనాభా పరంగా బాగా ఉన్నాయన్నారు. జనాభా పరంగా పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాది రాష్ర్టాల అజమాయిషి పెరుగుతుందని తెలిపారు. ఇది భారతదేశానికి ఎంతో ప్రమాదకరమని.. దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశాన్ని మొత్తం హిందీ బెల్డ్ లీడ్ చేసే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు..