మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక (Karnataka) వరకు వెళ్లాల్సిన అవసరం లేదు… మంత్రి కేటీఆర్..

కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై (DK Shivakumar) మంత్రి కేటీఆర్‌ (Minister KTR) ఫైర్‌ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక (Karnataka) వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారని, తెలంగాణ (Telangana) రైతులకు కాంగ్రెస్ (Congress) నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందని చెప్పారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి.. కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. అది మీ చేతకానితనానికి నిదర్శనం. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు.

ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా..?. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయింది. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయింది. కనీసం ఐదుగంటలు కూడా కరెంట్ లేక అక్కడి రైతాంగమే కాదు.. రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఎడాపెడా పవర్ కట్‌లతో వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నయి.

మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన మీ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలకు అక్కడి ప్రజలు అన్నమో రామచంద్ర అని అల్లాడిపోతున్నారు. రేషన్‌పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. మహిళలకు ఉచిత ప్రయాణం అని మభ్యపెట్టి మొత్తానికే కర్ణాటక ఆర్టీసిని దివాళా తీసిన విధానం ప్రజలకే కాదు.. అక్కడి ఉద్యోగులకు కూడా పెను ప్రమాదంగా మారింది.