నగరంలోని ఎల్బీనగర్‌లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు షోరూంలోని టైర్లు అంటుకుని దట్టంగా పొగలు వ్యాపించాయి.

సమాచారం అందగానే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు. కాగా, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్న సమయంలో గ్యారేజ్‌లోని రెండు సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.కాగా, 20కి పైగా సెకండ్ హ్యాండ్ కార్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం మూడు ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేమెంట్ ఫోర్స్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నాయి. దట్టంగా పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సమీపంలోని స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు అధికారులు……