నందీశ్వరుడు శివుడి వాహనం ఎలా అయ్యాడు..!!!

శివుడి వాహనం నంది.అందరికీ శివుడి గురించి, పార్వతి గురించి, వారి పుత్రులు అయిన వినాయకుడు, కుమారస్వామి గురించి తెలుసు. కానీ శివుడి వాహనం అయిన నంది గురించి కథనం తెలుసుకోవాల్సిందే…

పూర్వకాలంలో సాలంకాయనుడు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు శిలాదుడు. శిలాదుడికి సంతానం లేదు. సంతానం కోసం అతను చెయ్యని వ్రతం లేదు. స్నానం చేయని తీర్ధం లేదు. అయినా ప్రయోజనము కలుగలేదు. చివరకు శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యటం మొదలు పెట్టాడు. అలా చాలాకాలం గడిచింది. శిలాదుడు పట్టు వీడలేదు. అతని చుట్టూ పుట్టలు పెట్టినాయి. ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి “దేవదేవా! ఆశ్రితవత్సలా! అనాథ రక్షకా! నాకు సంతానం లేదు. నా వంశము నిలపటానికి అయోనిజుడైన కుమారుని ప్రసాదించు అతడు వేదవేదాంగవిదుడు, విద్వాంశుడు, సకల శాస్త్ర కోవిదుడు, గుణ సంపన్నుడు, గొప్ప శివభక్తుడు, దీర్ఘాయుష్యు కలవాడు అయి ఉండాలి” అన్నాడు.

శిలాదుని ప్రార్థన మన్నించి ఈశ్వరుడు “నువ్వు, కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కాని అల్పాయుష్కుడవుతాడు” అన్నాడు.

శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఇక లాభం లేదు అనుకుని సంతానం కోసం యాగం చెయ్యాలి అని సంకల్పించి యజ్ఞగుండాన్ని త్రవ్వుతున్నాడు. విచిత్రం అందుతో ఒక బాలుడు కనిపించాడు. చూడ చక్కని రూపురేఖలు, అందచందాలు, శరీర సౌష్టవము కలిగి ముద్దులు మూటగడుతున్న బాలుని ఇంటికి తెచ్చి పెంచుకోవటం మొదలుపెట్టాడు శిలాదుడు. ఋషి దంపతులు ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒక రోజున అతడికి నామకరణం చేద్దాము అనుకున్నారు.. అప్పుడు అశరీరవాణి “ఋషివర్యా! ఈ బాలుడు మీకే కాదు, ఆది దంపతులయిన పార్వతీపరమేశ్వరులకు కూడా ఆనందము కలుగచేస్తాడు. కాబట్టి ఇతడికి ‘నందుడు’ అని నామకరణం చెయ్యండి” అన్నది. ఆకాశవాణి చెప్పిన ప్రకారము బాలుడికి నందుడని పేరు పెట్టారు. ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు. బాలుడు ఏకసంధాగ్రాహి కావటంతో కొద్దికాలంలోనే సమస్త విద్యలూ. నేర్చుకున్నాడు.

ఒక రోజున శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు. ఆ సమయంలో సూర్యదేవుడు, వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు. స్వాగత సత్కారాలు, కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు. ‘బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణ సంపన్నుడు. కాని ఆయుష్షు మాత్రం లేదు” అన్నారు వాళ్ళు.

ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించటం ప్రారంభించారు. కుమారుడు వారి వద్దకు వెళ్ళి, ‘తండ్రి, మీ విచారానికి కారణము ఏమిటి?’ అన్నాడు. అప్పుడు నందుడు తల్లిదండ్రులతో “ఆర్యా” అష్టశ్వర్యములు, నవనిధులు, సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు. కాని శివుని అనుగ్రహం ఉంటే అవన్నీ వస్తాయి. కాబట్టి నన్ను ఆశీర్వదించి పంపండి. శివుని అనుగ్రహము సంపాదిస్తాను” అన్నాడు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి వెళ్ళాడు నందుడు.

కేదారము వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి నందుడు, “ప్రభూ! నీ దర్శన భాగ్యం కలిగిన తరువాత ఇంకా కావలసినది ఏముంది? ఎల్లవేళల యందు నీ దగ్గరే ఉండేటట్లు, నీకు సేవలు చేసేటట్లుగా నన్ను అనుగ్రహించు” అన్నాడు. అతడి కోరిక మన్నించాడు శివుడు. “దీర్ఘాయుష్మంతుడవై మాతో పాటు ఉండు” అన్నాడు.

తరువాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు. అతడి ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభ ముహూర్తంలో శివుడు త్రిలోకవాసులను పిలిచి, అందరి సమక్షంలో నందీశ్వరుడికి గణాధిపత్యమునిచ్చాడు. అప్పుడు మరుత్తులు ‘సుకీర్తి’ అనే తమ కుమార్తెతో నందీశ్వరుడికి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో “నీవు నా భక్తుడవు, కార్యావసరములయందు మంత్రిజీఆ, సందర్భం వచ్చినప్పుడు భృత్యుడివిగా, నా వాహనానివి. ముల్లోకాలను జయించగల బలపరాక్రమాలు కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఐదు తరాలవారు. నా రుద్రగణాలో చేరగలరు” అని దీవించాడు. ఈ రకంగా శిలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడైనాడు. ఇదీ నందీశ్వరుడి కథ.. ?