ప్రారంభమైన ‘మా’ ఎన్ని‌కల పోలింగ్‌..

గత కొంతకాలంగా ఎంతో ఆసక్తి రేపుతున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసో‌సి‌యే‌షన్‌) ఎన్ని‌క‌ల పోలింగ్‌ ప్రారంభయింది. నగరంలోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లోని మూడు తరగతి గదుల్లో పోలింగ్‌ జరుగుతున్నది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. రాత్రి 8 గంటలకు విజేతలెవరో అధికారంగా ప్రకటిస్తారు.
మా అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీచేస్తున్నారు. ఎన్నికల్లో 10 పేజీలతో కూడిన బ్యాలెట్‌ పేపర్లు వినియోగిస్తున్నారు. పదవుల మేరకు వివిధ రంగుల్లో బ్యాలెట్‌ పేపర్లను ముద్రించారు. మా ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా రెండు ప్యానెళ్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రెండెండ్లకొ‌క‌సారి జరిగే ‘మా’ ఎన్ని‌కల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపా‌ధ్యక్షులు, ఎగ్జి‌క్యూ‌టివ్‌ ప్రెసి‌డెంట్‌, జన‌రల్‌ సెక్రటరీ, ఇద్దరు జాయింట్‌ సెక్రట‌రీ‌లతో పాటు ట్రెజ‌రర్‌..18 మంది ఈసీ సభ్యు‌లతో కలిసి మొత్తం 26 మందిని ఎన్ను‌కుంటారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో 26 మంది కార్యవర్గం కోసం 54 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 925 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883కి మందికి ఓటుహక్కు ఉంది. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 60 మంది సీనియర్‌ సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. ‘మా’లో 60 ఏండ్లు పైబడిన నటీనటులు 125 మంది ఉన్నారు. తెలంగాణ కో ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.