మాఘ అమావాస్య.. ఈరోజున నదీస్నానం చేస్తే మంచిది..!!

మాఘ అమావాస్య.. ఈ రోజున నదీస్నానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు ప్రసిద్ధ వనదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. వనదుర్గమ్మ సన్నిధిలో మంజీరానదిలో స్నానం ఆచరించేందుకు జిల్లా వాసులతో పాటు పరిసర జిల్లాలు, జంటనగరాలు, పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు…

ఆలయ పరిసరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి మొత్తం 7 జల్లు స్నానాలతో పాటు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికంగా ప్రత్యేక టెంట్లు ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, నీడకు టెంట్లు వేశారు. పాపన్నపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు చెలిమెకుంట వద్ద, పోతంశెట్టిపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు టేకులగడ్డ వద్ద పార్కింగ్‌ కల్పించారు.

*సింగూరు నుంచి*

సింగూరు నుంచి యాసంగి పంటల సాగుకు ఈ నెల 6న 350 ఎంసీఎఫ్‌టీల నీటిని దిగువకు విడుదల చేయగా గురువారం ఘనపూర్‌ ఆనకట్టకు చేరుకున్నాయి. మాఘ అమావాస్య దృష్ట్యా ప్రాజెక్టు నుంచి నదీపాయలకు నీటిని విడుదల చేశారు.

దివ్యాంగులు, వయోవృద్ధులను ప్రయాణ ప్రాంగణాల నుంచి రాజగోపురం వరకు తరలించేందుకు ఆలయం తరఫున 8 ప్రత్యేక ఆటోలు ఏర్పాటు చేశారు.

వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరంతో పాటు ఒక అంబులెన్సును సిద్ధం చేశారు. ప్రాజెక్టులో, ఎవరైనా మునిగిపోతే వెంటనే రక్షించడానికి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 20 మంది గజ ఈతగాళ్లను నియమించారు.

*బందోబస్తు*
మెదక్‌ ఎస్పీ డా.బాలస్వామి ఆదేశాలతో మెదక్‌ డీఎస్పీ ఫణీందర్‌ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 6గురు ఎస్‌ఐలు, 15మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 65 మంది కానిస్టేబుళ్లు, ఏఆర్‌, మహిళా కానిస్టేబుళ్లు, హోం గార్డులతో బందోబస్తు చేపట్టనున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశామని, నిర్దేశించిన స్థలాల్లోనే స్నానాలు చేయాలని, అధికారుల సూచనలు పాటించాలని పాలకమండలి చైర్మన్‌ బాలాగౌడ్‌, ఈవో మోహన్‌ రెడ్డి కోరారు.

దుర్గామాత సన్నిధిలోని ఆర్టీసీ బస్టాండ్‌ చౌరస్తాలో శుక్రవారం మెదక్‌ అయ్యప్ప స్వామి ఆలయం ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నట్లు బాధ్యులు తెలిపారు.

*ప్రత్యేక బస్సులు*

మెదక్‌:మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ఏడుపాయలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మెదక్‌ డిపో మేనేజర్‌ సుధ తెలిపారు. మెదక్‌ నుంచి వయా నర్సాపూర్‌ మీదుగా సికింద్రాబాద్‌ వెళ్లే రోజువారి 23 బస్సులతో పాటు 7 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. మెదక్‌ నుంచి నాగ్సాన్‌పల్లి మీదుగా ఏడుపాయలకు, టేకులగడ్డ నుంచి భక్తులను తరలిచేందుకు రెండు ప్రత్యేకంగా బస్సులను అందుబాటులో ఉంచుతారు.