జై శ్రీరామ్‌ అనడానికి తప్పేముంది..?వెయ్యి సార్లు అయినా అనొచ్చు..మహమ్మద్ షమీ..

ఇటీవలే అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన నేపథ్యంలో దేశ ప్రజలంతా ఈ సందర్భాన్ని ఓ పండుగలా చేసుకున్నారు. హిందూవులే గాక ఇతర మతాల ప్రజలు సైతం అయోధ్యకు పోటెత్తుతున్నారు. అయోధ్య ప్రాణప్రతిష్టకు స్టార్‌ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, అనిల్‌ కుంబ్లే కూడా హాజరయ్యారు. తాజాగా టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అయోధ్య రాముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ముస్లిమును అయినప్పటికీ ‘జై శ్రీరాం’ అనడంలో తనకేమీ అభ్యంతరం లేదని మత సామరస్యాన్ని చాటాడు. ప్రతి మతంలోనూ ఇతర మతాన్ని ద్వేషించేవాళ్లు ఉంటారని వారితోనూ తనకేమీ ఇబ్బంది లేదని షమీ అన్నాడు. తాను మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు కొంతమంది ప్రేక్షకులు ‘జైశ్రీరాం’ అని నినదించడంపై షమీ స్పందించాడు.
ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ మాట్లాడుతూ.. ‘ప్రతి మతంలోనూ కొంతమందికి ఇతర మతాల వాళ్లంటే పడదు. వాళ్లు ఇతర మతాల ప్రజలను వ్యతిరేకిస్తారు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. రామ మందిరాన్ని నిర్మించినప్పుడు జై శ్రీరామ్‌ అనడానికి తప్పేముంది..? వెయ్యి సార్లు అయినా అనొచ్చు. ఒకవేళ నేను అల్లాహుఅక్బర్‌ నినాదాలు చేయాలనుకున్నప్పుడు వెయ్యిసార్లు నినదిస్తాను. అందులో తప్పేముంది..? భారతీయుడిగా నేను గర్విస్తున్నాను..’ అంటూ షమీ తెలిపాడు.