వినోద్ కాంబ్లీకి ఉద్యోగం ఇస్తాను, నెల‌కు రూ.1 ల‌క్ష వేత‌నం ఇస్తా..

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ స‌మ‌కాలీకుడు, స‌చిన్‌తోనే క్రికెట్‌లోకి ప్రవేశించిన చేసిన స్టార్ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీ… అతి త‌క్కువ స‌మ‌యంలోనే వివాదాల్లో చిక్కుకుని ఆట‌కు దూర‌మ‌య్యాడు. ఇత‌ర క్రికెట‌ర్ల మాదిరిగా అత‌డికి ఇప్పుడు పెద్ద‌గా సంపాద‌న కూడా లేద‌ట‌. మాజీ క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ ఇస్తున్న రూ.30 వేల పెన్ష‌న్‌తోనే అత‌డు నెట్టుకువ‌స్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలో త‌న కుటుంబాన్ని పోషించేందుకు త‌న‌కు ఏదైనా ప‌ని కావాలంటూ ఇటీవల కాంబ్లీ కోరాడు. ఈ మాట విన్నంత‌నే మ‌హారాష్ట్రకు చెందిన వ్యాపార‌వేత్త సందీప్ తోర‌ట్ స్పందించారు. వినోద్ కాంబ్లీకి తాను ఉద్యోగం ఇస్తాన‌ని, అందుకు గాను నెల‌కు రూ.1 ల‌క్ష వేత‌నం ఇస్తాన‌ని కూడా తోర‌ట్ ప్ర‌క‌టించారు. అయితే అదేదో క్రికెట్‌తోనే, లేదంటే క్రీడ‌ల‌తోనో కూడుకున్న ఉద్యోగం కాద‌ని ఆయ‌న తెలిపారు. ఆర్థిక విభాగంలో కాంబ్లీకి ఉద్యోగం ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క్రికెట్‌లో ప‌లు అవ‌కాశాలు వ‌చ్చినా… దూరాభార‌మ‌నో, గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌వి అనో వాటిని తిర‌స్క‌రిస్తున్నాడు. మ‌రి తోర‌ట్ ఆఫ‌ర్‌కు కాంబ్లీ ఏమంటాడ‌న్నది ఆస‌క్తిగా మారింది.