జనసేన నన్ను అవమానిస్తోంది.. నేను పడుండే రకం కాదు: మహాసేన రాజేష్..

కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం సీటు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ నుంచి తమ అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.94 మందితో ప్రకటించిన తొలి జాబితాలోనే ఆయనకు స్థానం కల్పించారు. అయితే పి.గన్నవరం నియోజకవర్గంలోని జనసేన, టీడీపీలోని కొంతమంది నేతల నుంచి మహాసేన రాజేష్‌కు నిరసనలు ఎదురయ్యాయి. అలాగే గతంలో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలపట్ల హిందూ, బ్రాహ్మణ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆయా వర్గాలకు క్షమాపణలు చెప్పారు మహాసేన రాజేష్. అంతేకాదు పి.గన్నవరంలో పోటీ నుంచి అవసరమైతే తప్పుకుంటానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత మహాసేన రాజేష్ నుంచి కానీ, టీడీపీ అధిష్టానం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు..కానీ పి. గన్నవరం టికెట్‌ జనసేనకు కేటాయిస్తున్నారని ఓసారి.. లేదు లేదు బీజేపీకి కేటాయిస్తున్నారంటూ మరోసారి వార్తలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. దీంతో మహాసేన రాజేష్ పెదవి విప్పారు. పి. గన్నవరం అభ్యర్థిత్వం విషయంలో తన మనసులోని మాటను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బయటపెట్టారు. నియోజవర్గంలోని బీజేపీ, జనసేన నేతలు తనను అవమానిస్తున్నారని మహాసేన రాజేష్ వాపోయారు…పి. గన్నవరం నియోజకవర్గంలో నన్ను జనసేన, బీజేపీ నేతలు అవమానిస్తున్నారు. చంద్రబాబు గారు గొప్ప మనసుతో నాకు తొలి జాబితాలోనే సీటు ఇచ్చారు. అయితే అప్పటి నుంచి మొదలు బీజేపీ, జనసేన, టీడీపీలోని కొంతమంది నాయకులు నాకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. దాన్ని అలా అలా.. పైకి తీసుకెళ్లి బ్రాహ్మణులు, హిందువులకు అంటగట్టారు. ఆ తర్వాత నేను కూడా నా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చా. ఇప్పుడేమో పి. గన్నవరం సీటును బీజేపీ ఆశిస్తోందని వార్తలు వస్తున్నాయి. అమలాపురం టీడీపీకి, పి. గన్నవరం జనసేనకు ఇచ్చారని వార్తలు రాశారు” అని మహాసేన రాజేష్ అన్నారు.