*
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థన మేరకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజీని మంజూరు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తుమ్మలూరులో ఒక సబ్ స్టేషన్‌ను మంజూరు చేస్తున్నాం. వీలైనంత తొందరగా ఈ పనులు పూర్తి చేస్తాం. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో వస్తుంది.. మీ వరకు కూడా తెస్తాం. బీహెచ్ఈఎల్ నుంచి కందుకూరు వరకు మెట్రో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాను అని కేసీఆర్ ప్రకటించారు.
మహేశ్వరం నియోజకవర్గంలో తుమ్మలూరులో దశాబ్ది సందర్భంగా రూ. కోటితో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నాం అని కేసీఆర్ ప్రకటించారు. దీనికి దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని నామకరణం చేయాలని కోరుతున్నాం. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని 65 గ్రామ పంచాయతీలకు రూ. 15 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నాం. జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున, బడంగ్‌పేట్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లకు రూ. 50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు.