మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే….

మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే

మైనర్లు వాహనాలు నడిపి పోలీసులకు చిక్కితే మైనర్లకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులకు, వాహన యజమానికి జైలు శిక్ష తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ హెచ్చరించారు.18 ఏళ్లు నిండని వారికి వాహనం అందజేయడంతో పాటు వారిని ప్రోత్సహించే వారికి జైలు శిక్ష తప్పదన్నారు. మైనర్ల డ్రైవింగ్ తో తల్లిదండ్రులకు కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పిచడం కోసం కొత్తగా రూపొందించిన సోషల్ మీడియా ప్రచార వీడియోను గురువారం కమిషనర్ విడుదల చేశారు. మైనర్లకు వాహనం అందించడం ద్వారా కలిగే అనర్థాలపై వివరిస్తూ రూపొందిచిన నలబై క్షణాల నిడివిగల సోషల్ మీడియాల ప్రచారం కోసం ఈ వీడియోను రూపొందించారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ మైనర్ చిన్నారులకు నడిపేందుకు వాహనాలను ఇవ్వవద్దని.. తెలిసి,తెలియని వయస్సులో వాహనం నడపడం ద్వారా మైనర్లు రోడ్డు ప్రమాదాలకు గురికావడమే కాకుండా ఇతర వాహనదారులు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. మీ చిన్నారులను చదువుల్లో రాణించే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు పోలీసు కమిషనర్ ప్రమోద్ కుమార్. మైనర్లు వాహనం నడపడంతో జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులే భాధ్యులవుతారన్నారు. ఇందుకుగాను తల్లిదండ్రులకు జైలు శిక్ష తప్పడని పోలీస్ కమిషనర్ సూచించారు.
వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ విభాగం అధ్వర్యంలో ట్రాఫిక్ విధులపై వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణా తరగతులను వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద్ కుమార్ గురువారం ప్రారంభించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ట్రాఫిక్ విధులతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలు తీరుపై సిబ్బందికి అవగాహన కల్పించడం కోసం శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు.