మాల్దీవుల అధ్యక్షుడు మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు..

భారత్‌ (India)తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేశారు…హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల కోసం న్యూదిల్లీతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. సైనిక సహకారంపై మాల్దీవులు-చైనాల మధ్య ఒప్పందం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ముయిజ్జు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

”హైడ్రోగ్రాఫిక్‌ సర్వేలకు అవసరమైన మెషిన్లు, వసతులు ఏర్పాటుచేసుకునేందుకు రక్షణశాఖ చర్యలు మొదలుపెట్టింది. వీటితో నీటి అడుగున మనమే సొంతంగా పరిశోధనలు చేపట్టగలం. అప్పుడు మన ప్రణాళికలను మనమే తయారుచేసుకోగలం. ఛార్ట్‌లను మనమే గీసుకోగలం. ఈ సముద్ర జలాలు మన సంపద, మన వారసత్వం. అందుకే, ఈ సర్వేల కోసం భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవద్దని నిర్ణయించాం” అని తమ దేశ ప్రజలకు ముయిజ్జు వెల్లడించారు. మాల్దీవుల ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌పై నియంత్రణ పెంచుకునేందుకు త్వరలోనే నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు..2019లో ప్రధాని మోదీ మాల్దీవుల్లో పర్యటించిన సమయంలో అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీమ్‌ మహమ్మద్‌ సొలిహ్‌ న్యూదిల్లీతో ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2021లో భారత్‌ ఆ దీవుల్లో హైడ్రోగ్రఫీ ఆఫీసును కూడా ప్రారంభించింది. అయితే, చైనా అనుకూల నేతగా పేరున్న ముయిజ్జు అధికారంలోకి రాగానే ఇరుదేశాల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు నెలకొన్నాయి.

ఇదే అదనుగా చేసుకున్న చైనా.. మాల్దీవులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దీవులకు ఉచితంగా సైనిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకుంది. ఇక, ఇటీవల డ్రాగన్‌ పరిశోధక నౌక వారం పాటు మాలె తీరంలో లంగరు వేసింది…