మాల్దీవులు రాజధాని మాలెలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో 10 మంది మరణించారు. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులున్నారని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తని తెలిపారు.
మాలెలోని కిక్కిరిసిన భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. వాహనాలు రిపేర్‌చేసే కింది ఫ్లోర్ నుంచి మంటలు పైకి ఎగిసిపడ్డాయని అధికారులు తెలిపారు. పై అంతస్తులో ఇప్పటి వరకూ 10 మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. మంటలు ఆర్పడానికే నాలుగు గంటల సమయం పట్టినట్లు చెప్పారు. మాలె అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటి. ఉపాధి కోసం వచ్చే విదేశీయులకు ఇక్కడ సరైన సదుపాయాలు ఉండవని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇక్కడ బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, నేపాల్,పాకిస్థాన్‌కు చెందిన వారు నివసిస్తుంటారు. కొవిడ్ సమయంలో స్థానికులతో పోలిస్తే.. విదేశీ కార్మికుల్లో వైరస్ మూడు రెట్లు వేగంగా వ్యాపించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇది అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోందనే విమర్శలు వచ్చాయి.