మలేరియాకు టీకా వచ్చేసింది..మొట్టమొదటి టీకా ఇదే..

మలేరియాకు టీకా వచ్చేసింది. ఇంగ్లండ్‌కు చెందిన ఫార్మా సంస్థ గ్లాక్సోస్మిత్‌ైక్లెన్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ RTS,S/AS01 లేదా RTS,SSకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ‘RTS,SS టీకాను మలేరియా నివారణకు వాడవచ్చు’ అని డబ్ల్యూహెచ్‌వో బుధవారం సిఫారసు చేసింది. ఇది మలేరియాకు కారణం అయిన ప్లాస్మోడియం ఫాల్సిపారంను నిరోధిస్తుందని పేర్కొన్నది. మలేరియా నివారణకు డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన మొట్టమొదటి టీకా ఇదే. ఘనా, కెన్యా, మాలావీలో రెండేండ్లుగా 8 లక్షల మంది పిల్లలపై జరిగిన ట్రయల్స్‌/పైలట్‌ ప్రాజెక్టు ఆధారంగా టీకాకు అనుమతి లభించింది. ఇది నాలుగు డోసుల వ్యాక్సిన్‌.ఐదు నెలల వయసులో తొలి డోసు వేస్తారు. ‘మలేరియా టీకాకు అనుమతి లభించడం చరిత్రాత్మకం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ వచ్చేసింది. ఏటా లక్షల మంది పిల్లలను కాపాడవచ్చు’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సంతోషం వ్యక్తం చేశారు.