మన ఊరు- మన బడి’లో భాగస్వాములు కండి, అమెరికాలోని రాష్ట్ర ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌….

అమెరికాలోని రాష్ట్ర ఎన్నారైలతో మంత్రి కేటీఆర్‌
‘మన ఊరు- మన బడి’లో పాల్గొనాలని పిలుపు
పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారింది.

పలు ప్రధాన కంపెనీలు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలను కాదని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్ర ప్రభుత్వ రాయబారులు మీరే. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో ఎన్నారైలు పాలుపంచుకోవాలి.

మంత్రి కేటీఆర్‌..అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాయబారులుగా వ్యవహరించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ రాష్ర్టాభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఎన్నారైలు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం ఆదివారం లాస్‌ఏంజెల్స్‌ చేరుకొన్నది. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు బృందానికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌.. ఎన్నారైలతో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలను వారికి వివరించారు. రాష్ట్రంలో టీఎస్‌ ఐపాస్‌ విధానం విజయవంతంగా కొనసాగుతున్నదని చెప్తూ.. ఏయే దేశాల నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఫుడ్‌ప్రాసెసింగ్‌, లైఫ్‌ సైన్సెస్‌లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలను వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని, పలు ప్రధాన కంపెనీలు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలను కాదని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించిన మంత్రి.. ఇందులో ఎన్నారైలు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారని చెప్పారు. ఇప్పటికే పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టిందని, అందులో ప్రజలను కూడా భాగస్వాములను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్‌ బృందం వివిధ కంపెనీల అధిపతులతో చర్చలు చేపట్టనున్నది.