దేశాన్ని కాపాడే విషయంలో, దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రధాని మోదీని మించిన నాయకుడు లేరు…మందకృష్ణ మాదిగ..

హైదరాబాద్: దేశాన్ని కాపాడే విషయంలో, దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రధాని మోదీని మించిన నాయకుడు లేరని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

మోదీ ఒక్కసారి మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకుంటారనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. మాదిగ ఉపకులాల సభకు విచ్చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మాదిగల సభకు మోదీ వస్తారని తాము ఊహించలేదన్నారు.
“ఈ సమాజం పశువులకంటే హీనంగా మమ్మల్ని చూసింది. మాదిగలను ఇప్పుడిప్పుడే చైతన్య పరుస్తున్నాం. మాకు అండగా ఉండేందుకు వచ్చిన మోదీకి ధన్యవాదాలు. కాంగ్రెస్, భారాస.. కేవలం మాటలే చెబుతున్నాయి. మా ఆకాంక్షలు నెరవేర్చేది భాజపానే. బలహీనవర్గాలకు అండగా ఉండే పార్టీ భాజపానే. తెలంగాణకు బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించింది ఒక్క భాజపా మాత్రమే. మోదీకి సామాజిక స్పృహ ఉంది కనుకే మా సభకు వచ్చారు. బలహీన వర్గాల కష్టాలు ప్రధానికి బాగా తెలుసు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులను చేసిన ఘనత ప్రధాని మోదీదే” అని మందకృష్ణ వివరించారు. ప్రధాని మోదీ సభావేదికపైకి రాగానే మందకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మందకృష్ణను భుజం తట్టి మోదీ ఓదార్చారు.