మంత్రి గంగుల కమలాకర్ కు తృటిలో తప్పిన పెను ప్రమాదం ..

సభ వేదిక కూలి మంత్రి గంగులకు గాయాలు

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెర్లబూట్కూర్ లో ఏర్పాటు చేసిన సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో మంత్రి గంగుల సహా ఇతర నేతలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు చిన్న గాయాలు కాగా జెడ్పిటీసీ సభ్యుని కాలు విరగడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వేదికపైకి పరిమితికి మించి సంఖ్య రావడంతో కుప్పకూలినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంపై మంత్రి గంగుల స్పందించారు. “నాకు చిన్న గాయమే అయింది. ప్రాథమిక చికిత్స కూడా చేశారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని” మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు…ధాన్యం కొనుగోలు కేంద్రం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కరీంనగర్ రూరల్ లోని చెర్లబూట్కూర్ కు మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అయితే అక్కడే ఓ చిన్న సభావేదికను ఏర్పాటు చేశారు. సభావేదిక చిన్నది కావడం ఏకంగా 200 మంది దానిమీదకు వెళ్లడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనితో మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే జడ్పీటీసీ సభ్యుని కాలు విరగడంతో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మంత్రి గంగులకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందజేశారు.