డబల్ బెడరూం పేరు మార్చి గృహ లక్ష్మీ అని నామకరణం.. మంత్రి హరీష్ రావు..

డబల్ బెడరూం పేరు మార్చి గృహ లక్ష్మీ అని నామకరణం..

రాష్ట్రంలో లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి హారీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహయం చేస్తామని ప్రకటించారు.

ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహయం చేసే పథకానికి గృహలక్ష్మీ పథకంగా పేరు పెడుతున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఈ గృహాలక్ష్మీ పథకం కింద ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహయం చేస్తోందని.. సొంత జాగలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు మూడు విడతల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గృహాలక్ష్మీ పథకం నిబంధనలను కూడా సరళంగా నిర్ణయించామన్నారు. గృహలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలో 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు ఇస్తామని.. లబ్ధిదారుల ఎంపిక వెంటనే చేపట్టనున్నామని పేర్కొన్నారు.