హరితహారం మొక్కలు 242 కోట్లు త్వరలో అటవీశాఖలో 1,598 పోస్టుల భర్తీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి..

హరితహారం మొక్కలు 242 కోట్లు
త్వరలో అటవీశాఖలో 1,598 పోస్టుల భర్తీ
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి..

తెలంగాణా లో పెరిగిన పచ్చదనం 7.70%..

తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 2015 నుంచి 2021 వరకు 7.70 శాతం పచ్చదనం పెరిగిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఇండియన్‌ స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌(ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) వెల్లడించిందని గుర్తుచేశారు.

హరితహారంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 242 కోట్ల మొక్కలు నాటినట్టు వివరించారు. శనివారం ఆయన శాసనసభలో అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల పద్దులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. అటవీశాఖను మరింత బలోపేతం చేసేందుకు 1,598 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేన్‌ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రంలో దేశంలోనే అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. అడవుల రక్షణకు రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌, జీపీఎస్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నామని, అటవీ నేరగాళ్లపై పీడీ యాక్ట్‌ పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో తొలి విడతగా 109 అర్బన్‌ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 పార్‌లను ప్రారంభించామని, మరో 16 పార్కులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. మిగిలిన 56 పారుల అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. రెండవ విడతలో మరో 70 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్‌లను ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా 1.77 లక్షల ఎకరాల్లో పచ్చదనం పెరుగుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల (ఎఫ్‌సీఆర్‌ఐ) ప్రాంగణంలోనే కొత్తగా అటవీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన అర్బన్‌ డే ఫౌండేషన్‌ హైదరాబాద్‌ను ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌గా గుర్తించడం గర్వకారణమని పేర్కొన్నారు.

37ప్రారంభించిన అర్బన్‌ ఫారెస్టు పార్కులు

16త్వరలో ప్రారంభించనున్నవి
56అభివృద్ధిపనులు సాగుతున్నవి
702వ విడతలో ఏర్పాటు చేయనున్నవి
342.85 కోట్లతో 1,612 ఆలయాల అభివృద్ధి
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రి
28న మహా సంప్రోక్షణతో భక్తులకు స్వయంభువుల దర్శనం

అసెంబ్లీలో దేవాదాయశాఖపద్దులను ప్రతిపాదించిన మంత్రి

స్వరాష్ట్రంలో ఇప్పటివరకు కామన్‌ గుడ్‌ఫండ్‌, ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ.342.85 కోట్లతో 1,612 ఆలయాల్లో అభివృద్ధి పనులను చేపట్టినట్టు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 1,736 దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యం పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవాదాయశాఖ భూముల్లో 4,175.27 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొన్నదని వివరించారు. శనివారం ఆయన అసెంబ్లీలో దేవాదాయశాఖ పద్దును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. 2022వ సంవత్సరం యాదాద్రీశుడి ఆలయం చరిత్రలో గొప్పగా నిలిచిపోతుందని అన్నారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణతో భక్తులకు స్వయంభువుల దర్శన భాగ్యం లభిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలతో యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు గ్రామస్థాయి ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతుల కల్పన, ఆలయ భూముల పరిరక్షణ కోసం దేవాదాయశాఖ కృషి చేస్తున్నదని చెప్పారు.