పోలీస్ అధికారి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిషార్ దాస్ కన్నుమూత..
ఓ పోలీస్ అధికారి జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బీజేడీ సీనియర్ నేత. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నవ కిశోర్ దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జూర్సగూడ జిల్లాలోని బ్రెజరాజనగర్ గాంధీ చౌక్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఎఎస్ఐ గోపాల్ దాసు సమీపం నుండి తుపాకీతో కాల్పులు జరిపాడు. మంత్రి ఛాతిలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో మంత్రి స్పృహకోల్పోయి పడిపోయారు. ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. సమీపంలో ఉన్న అధికారులు, నేతలు గాయపడిన మంత్రిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు..అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్ లోని ఆసుపత్రికి వాయుమార్గంలో తరలించారు. భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంత్రి మృతి చెందారు. నిందితుడు ఎఎస్ఐ గోపాల్ దాస్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంత్రిపై నిందితుడు కాల్పులు జరపడానికి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని ప్రశ్నిస్తున్నామని, పూర్తి విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని బ్రజ్రనగర్ ఎస్ డీ పీ ఓ గుప్తేశ్వర్ బోయ్ మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు క్రైమ్ బ్రాంచ్ ను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. మరో పక్క భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని మంత్రి మద్దతుదారులు స్థానికంగా ఆందోళనకు దిగారు. కావాలని చేసిన కుట్రేనని ఆరోపిస్తున్నారు. కాగా మంత్రిపై కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.