మటన్ విషయంలో గొడవ, స్నేహితుడి దారుణ హత్య.. పండుగపూట దారుణం..

సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాలన్ని ప్రతి ఇంట్లో సంబురాలు అంబరాన్నంటుతాయి. కుటుంబ సభ్యులతో పాటు ఎక్కడెక్కడో స్థిరపడిన స్నేహితులు కూడా సొంతూరికొచ్చి.. చిన్ననాటి దోస్తులతో కలిసి దావత్‌లు చేసుకుంటుంటారు. పండుగపూట సరదాగా సాగాల్సిన వేడుకల్లో మటన్ బొక్కలు చిచ్చుపెట్టాయి. మద్యం మత్తులో మటన్ కోసం ఇద్దరు స్నేహితులు గొడవపడగా.. అది కాస్త హత్యకు దారి తీసింది. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్‌ తుకారాం గేటు పీఎస్‌ పరిధిలో జరిగింది. గోల్‌బాయ్‌ బస్తీకి చెందిన చారి, అజయ్‌కి మధ్య మటన్‌ తినే విషయంలో గొడవ జరిగింది. అయితే.. ఇద్దరు అప్పటికే పీకలదాకా మద్యం తాగేసి ఉండటంతో.. గొడవ కాస్త ఘర్షణగా మారింది..ఈ క్రమంలోనే చారిపై అజయ్‌ కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడటంతో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే నిందితుణ్ని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట ఈ దారుణం జరగటంతో.. ఆ పరిసరాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.