నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు…

మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు..

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకు జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి..

పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో.. పూజారులు అడవికి వెళ్లి మండలు(చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకువచ్చి దేవుళ్లకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకొనేవారు. దీనినే మండమెలిగే పండగగా పేర్కొంటారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పనిచేసి పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు..