మరోసారి కుంగిన మేడిగడ్డ బ్యారేజీ..పియర్స్‌కు పగుళ్లు..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ (Medigadda Barrage) మరోసారి కుంగింది. బ్యారేజీ వద్ద ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి, 7వ బ్లాక్‌లోని 20వ పియర్‌ వద్ద దిగువన పగుళ్లు ఏర్పడ్డాయి. దీనితో బ్యారేజీపై ఉన్న వంతెన కుంగి ప్రమాదకరంగా మారింది.వంతెనపై సైడ్‌ బర్మ్‌ గోడ, ప్లాట్‌ఫారంతోపాటు రోడ్డు సుమారు 2, 3 ఫీట్ల మేర కుంగిపోయాయి. దీనితో బ్యారేజీ గేట్ల(Barrage gates)కు కూడా ప్రమాదం పొంచి ఉందని అంచనా. ఘటన జరిగిన వెంటనే సాగునీటిశాఖ అధికారులు, ఇతర నిపుణులు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు…

కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలో 20వ పియర్‌ కుంగుబాటు నేపథ్యంలో దానికి సమీపంలోని అయిదారు పియర్స్‌కు స్వల్పంగా పగుళ్లు ఏర్పడినట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది..
పియర్‌ కుంగుబాటు అనంతర పరిస్థితులపై శుక్రవారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అందిన సమాచారం ప్రకారం.. మొదట బ్యారేజీ ఎగువన కాఫర్‌ డ్యాం నిర్మాణం, నీటిని తోడిపోయడం, పునాది వరకు పరిశీలన, బ్యారేజీలో ఎగువ, దిగువ కట్‌ ఆఫ్‌ వాల్స్‌ పరిస్థితిపై అధ్యయనం చేయనున్నారు. కుంగుబాటు ఒక్క బ్లాకుకే పరిమితమయిందా, ఇతర బ్లాకుల పరిస్థితి ఏమిటన్నది కూడా అధ్యయనం చేస్తారు. అనంతరం అవసరమైన చర్యలకు నిపుణులను సంప్రదించి నిర్మాణ సంస్థతో పునరుద్ధరణ పనులు చేయించాలని నిర్ణయించారు. దీనికోసం ఒక షెడ్యూల్‌ను రూపొందించారు…