కాళేశ్వరానికి, మొన్న మేడిగడ్డ, నేడు అన్నారం బ్యారేజీ దిగువన రెండు చోట్ల బుంగలు..

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం(సరస్వతి) బ్యారేజీ దిగువన సీపేజీ(బుంగలు) ఏర్పడ్డాయి.ఎండ్‌సీల్‌ ప్రాంతంలో పలు చోట్ల నీటి బుంగలు వచ్చాయి. బ్యారేజీకి సంబంధించి బ్లాక్‌ బి-4లోని 38, 42 పియర్‌ల వద్ద వెంట్‌ ప్రదేశాలలో రెండు రోజుల క్రితం అవి ప్రారంభమయ్యాయి. రెండు చోట్ల అవి ఎక్కువగా ఉండటంతో ఇంజినీర్లు చర్యలు ప్రారంభించారు. వాటిని అరికట్టేందుకు ముందు జాగ్రత్త చర్యగా రింగ్‌బండ్‌ వేస్తున్నారు. రెండు చోట్ల రెండు మూడు అంగుళాల మేర సీపేజీ ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు. ఇసుక తేలకపోవడంతో ప్రమాదం లేదని వారు చెప్తున్నారు. నాటు పడవల ద్వారా బుంగలు ఏర్పడిన ప్రాంతాలకు చేరుకొని ఇసుక సంచులు, రాళ్లతో అడ్డుకట్ట వేశారు. సుమారుగా రెండు వేల బస్తాలను అలా వేసినా ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. అధికారులు పనులను కొనసాగిస్తున్నారు…’ఇది పైపింగ్‌ ప్రారంభ దశ. దీనిని గుర్తించకపోతే దిగువన ఇసుక క్రమంగా తరలి వెళ్తుంది. పియర్స్‌ కుంగిపోవడం, నష్టం వాటిల్లడం జరుగుతుంది’ అని డిజైన్లలో అనుభవం ఉన్న సీనియర్‌ ఇంజినీరు ఒకరు తెలిపారు. మేడిగడ్డలో ఇలాగే జరిగి ఉండొచ్చని అయితే అన్నారంలో వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం ప్రారంభించడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం కూడా అన్నారంలో ఇలాంటి సమస్య వచ్చింది. ‘అప్పుడు సీపేజీ ఎక్కువ ఉండటంతో పాటు కొద్దిగా ఇసుక కదలడం కూడా గుర్తించి వెంటనే కెమికల్‌ గ్రౌటింగ్‌ చేశాం. ఇందుకోసం కోటిన్నర రూపాయలు ఖర్చయింది’ అని సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. నాలుగు రోజులుగా బ్యారేజీలో నీటి నిల్వను క్రమక్రమంగా తగ్గించారు. ‘అన్నారం బ్యారేజీ దిగువన పైపింగ్‌లాంటి పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం అందిన నేపథ్యంలో దానిపై నివేదిక పంపాలి. అన్నారం, సుందిళ్ల కూడా మేడిగడ్డ బ్యారేజీలాంటి డిజైన్‌ అయినందున అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని కేంద్ర జల సంఘం తెలంగాణ డ్యాం సేఫ్టీ అధికారులకు తెలిపింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కూడా ఈ లేఖను పంపింది…