ఆయన తన నోటికి పని చెప్పినా అక్బరుద్దీన్..ఇటలీ, రోమ్ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. మరోసారి ఆయన తన నోటికి పని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ.. మీ పార్టీ ఇటలీ, రోమ్ నేతలపై ఆధారపడి ఉందని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిజాయితీపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నా.. అధికారంలో కూర్చొబెట్టేది మాత్రం తామే అని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి కేసీఆర్ వరకు అందరితోనూ పనిచేయించామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా లేదని.. అందుకే ఇతర పార్టీల లీడర్లను తెచ్చి నింపుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పార్టీలు మారి కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యాడని ఎద్దేవా చేశారు..

ఓ కార్యక్రమంలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ”మేము మహారాష్ట్ర నుంచి వచ్చామని, బీజేపీకి ‘బీ-టీమ్‌’ అని కాంగ్రెస్‌ వాళ్లు అంటున్నారు. నేను కాంగ్రెస్ బానిసలను అడుగుతున్నాను.. మీ అమ్మ (సోనియా గాంధీ) ఎక్కడ నుండి వచ్చారు?” అని ప్రశ్నించారు. అలాగే.. రేవంత్ రెడ్డి గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పని చేశారని, ఆ తర్వాత టీడీపీలోకి చేరారని, ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నారని బాంబ్ పేల్చారు. ‘అసదుద్దీన్ ఒవైసీ కొండలపై నివసించే నిజాం’ అంటూ ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అక్బరుద్దీన్ ఇంకా మాట్లాడుతూ.. అధికారంలో ఎవరున్నా సరే, వాళ్లు ఏఐఎంఐఎం నాయకత్వానికి కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు… బీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో ఏదీ అధికారంలో ఉన్నా.. తమ పార్టీకి కట్టుబడి, తాము చెప్పిందే వినాలని కండీషన్ పెట్టారు. లేకపోతే వారి స్థానం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి దూరంగా ఉండాలని, లేదంటే వారి అసలు స్థానమేంటో చూపిస్తామంటూ అక్బరుద్దీన్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు..