బీఎల్ఆర్ మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్.. ఇంకా అందని బిఫామ్…!!

మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మా రెడ్డి (బీఎల్ఆర్) గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తుంగపాడు గ్రామ మహిళా దళిత సర్పంచ్ మచ్చ నాసరమ్మ చేతుల మీదుగా నామ పత్రాలు తీసుకున్న బీఎల్ఆర్ కార్యకర్తలు అభిమానులతో ర్యాలీ గా వచ్చి నామ పత్రం సమర్పించారు..కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఆశించిన బీఎల్ఆర్ పేరు అధిష్టానం పరిశీలనలో ఉన్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు… దాదాపు బిఎల్ఆర్ పేరు ఖరారు అయినట్టుగానే పార్టీ వర్గాల సమాచారం… పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టడంతో ఒక్కసారిగా బిఎల్ఆర్ పేరు తెరపైకి వచ్చింది..

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు కలిసి నడవాలన్న సూత్రప్రాయ అంగీకారం కుదిరినా .. మద్యలో సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదరలేదు… జాతీయ స్థాయిలో ‘ ఇండియా ’ కూటమిలో ఈ పార్టీలు కలిసే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల్లో సైతం మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని అనుకున్నారు .. తర్వాత సిపిఎం కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల భిన్నమైన అభిప్రాయం వినిపించి విడిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.. దీంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలనుకున్న వారికి కొంత లైన్ క్లీన్.. ఒంటరిగా సీపీఎం పోటీ నిర్ణయంతో .. తొలిగిన అడ్డంకి
కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు చర్చల్లో సీపీఎం బలంగా డిమాండ్ చేసిన నియోజకవర్గం మిర్యాలగూడెం. ఇక్కడి ఆ పార్టీకి చెప్పుకోదగిన స్థాయిలోనే విజయాల ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటికే మూడు సార్లు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జూలకంటి రంగారెడ్డి ఈ సారికూడా పోటీ చేస్తారని, పట్టున్న మిర్యాలగూడను తమకు కేటాయించాలని సీపీఎం కోరుతూ వచ్చింది. ఈ సీటును సీపీఎంకు కేటాయించడానికి కాంగ్రెస్ నాయకత్వం కొంత సుముఖంగా ఉన్నా.. మిగతా సీట్లలో వచ్చిన పేచీ వల్ల అసలు పొత్తు అంశమే ఎత్తిపోయింది. కాంగ్రెస్ నుంచి అనుకున్నంత చొరవ లేకపోడంతో చూసీ చూసీ విసిగిపోయిన సీపీఎం తాము ఒంటరిగానే పోటీ చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా 17 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆ నియోజకవర్గాల పేర్లను కూడా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కు ఉన్న అడ్డంకి తొలిగినట్లు అయ్యింది. ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది…

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీపీసీసీ నాయకత్వానికి టికెట్ కోసం దాఖలైన దరఖాస్తుల్లో అత్యధికంగా మిర్యాలగూడ టికెట్ కావాలనే దాఖలు అయ్యాయి. ఇక్కడి నుంచి 18 మంది టికెట్ కోసం దరఖాస్తు చేస్తుకున్నారు. కానీ, టికెట్ రేసులో ప్రధానంగా మిగిలింది మాత్రం బత్తుల లక్ష్మారెడ్డి అలియాస్ బీఎల్ఆర్. ఆయనతో పాటు కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, తెలంగాణ ఉద్యమ నాయకుడు అలుగబెల్లి అమరేందర్ రెడ్డి వంటి వారు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు..