ఎమ్మెల్యే రఘునందన్ రావు పై హైకమాండ్ ఆగ్రహం..!

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్‌గా ఉంది. ఆయన ఇటీవల ఢిల్లీలో చేసిన చిట్ చాట్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. అందులో ఆయన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్‌పైనా ఘాటు విమర్శలు చేశారు. వారు వచ్చి దుబ్బాకలో ప్రచారం చేయలేదని, వారి బొమ్మలతో తాను ఎమ్మెల్యేగా గెలవలేదని, ప్రజలు తనను చూసి ఓట్లేశారని పేర్కొన్నారు. పార్టీ గుర్తు చివరి అంశంగా ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ గత ఎన్నికల్లో పుస్తెలమ్మి పోటీ చేశారని, అలాంటిది ఇప్పుడు రూ.వందల కోట్లు యాడ్లు ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని చిట్ చాట్‌లో ప్రశ్నించారు. అంతేకాకుండా తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు..పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదా జాతీయ అధికార ప్రతినిధి ఈ మూడు పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దుబ్బాకలో తనకంటే ముందు బీజేపీ పోటీచేస్తే బీజేపీకి వచ్చింది కేవలం 3500 ఓట్లు మాత్రమేనని రఘునందన్ రావు చిట్ చాట్‌లో తెలిపారు. ఇదంతా మీడియా ఛానళ్లలో టెలికాస్ట్, ప్రచురితమవ్వడంతో తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బుకాయించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అయితే ఇప్పుడా చిట్ చాట్‌కు సంబంధించిన ఆడియో రికార్డ్ హైకమాండ్ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. చిట్ చాట్‌లో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ధిక్కరించడంతో పాటు పార్టీ గుర్తు చివరి అంశమని చెప్పడంతో ఆయనపై హైకమాండ్ మరింత సీరియస్‌గా ఉంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు రఘునందన్‌పై జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ అంశంపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.