‌గుర్రంబోడుతండాలో నిన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ల‌పెట్టిన‌ గిరిజ‌న భ‌రోసా యాత్ర ఓ వంచ‌న యాత్ర… హుజుర్‌న‌గ‌ర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి..

‌గుర్రంబోడుతండాలో నిన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ల‌పెట్టిన‌ గిరిజ‌న భ‌రోసా యాత్ర ఓ వంచ‌న యాత్ర అని హుజుర్‌న‌గ‌ర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ నిన్న నిర్వ‌హించిన ఆ యాత్ర‌లో స్థానికులు ఎవ‌రూ లేరు అని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన బీజేపీ కార్య‌క‌ర్త‌లే హంగామా చేసి పోలీసుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని మండిప‌డ్డారు. నాగార్జున సాగ‌ర్‌లో ఓట్ల కోసం బీజేపీ డ్రామాలు మొద‌లుపెట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌ర్వే నెంబ‌ర్ 540 గురించి బీజేపీ నేత‌ల‌కు తెలుసా? అని ప్ర‌శ్నించారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న‌ప్పుడు దొంగ ప‌ట్టాల‌ను ప్రోత్స‌హించారు అని గుర్తు చేశారు. తాను గెలిచిన త‌ర్వాత న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేను అయిన త‌ర్వాత ఇద్ద‌రు ఎమ్మార్వోలు స‌స్పెండ్ అయ్యారు. ఉత్త‌మ్‌తో బండి సంజ‌య్ కుమ్మ‌క్కై ఇదంతా చేస్తున్నార‌ని ఎమ్మెల్యే ధ్వ‌జ‌మెత్తారు. త‌న‌పై బండి సంజ‌య్ చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని శానంపూడి సైదిరెడ్డి తేల్చిచెప్పారు. అబ‌ద్ధ‌మైతే ఎంపీ ప‌ద‌వికి బండి సంజ‌య్ రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు. బీజేపీ నేత‌ల‌కు చేత‌నైతే కేంద్రంతో మాట్లాడి గిరిజ‌నుల‌కు 12 శాతం రిజ‌ర్వేషన్లు ఇప్పించాల‌ని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు.