జనవరితొ ముగియనున్న 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం..!

తెలంగాణ శాసనమండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గాల కోటాలో ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే జనవరి 4 నాటికి ముగియనుంది. ఇప్పటికే శాసనసభ్యుల కోటాలో 6 స్థానాలు, గవర్నర్‌ నియమిత కోటాలో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి. మరో మూడు నెలల్లో పదవీకాలం ముగియనున్న 12 మందితో కలిపితే ఖాళీల సంఖ్య 19కి చేరనుంది. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, సభ్యులు శంభీపూర్‌ రాజు, కూచికుళ్ల దామోదర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, తేరా చిన్నపరెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పురాణం సతీష్‌కుమార్‌, కసిరెడ్డి నారాయణరెడ్డిలు తమ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌ కలిశారు. పదవీకాలం ముగిసే నాటికి మరో దఫా సమావేశాలు లేనందున వారు ముందుగా సీఎంను కలిసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, పట్నం మహేందర్‌రెడ్డిల పదవీకాలం సైతం వచ్చే జనవరి 4న ముగియనుంది. ఇప్పటికే శాసనసభ్యుల కోటాలోని 6 స్థానాలకు ఎన్నికలు వాయిదా పడడంతో అవి ఖాళీగానే ఉన్నాయి.