స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార తెరాస పక్కా ప్రణాళిక….. మొత్తం ఓటర్లు విరే.. పోటీ కుడా వీరిమధ్య.!!.

R9TELUGUNEWS.COM.: తెలంగాణలో అయిదు ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికార తెరాస పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అయిదు జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అన్నింటా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆ పార్టీ ముందు జాగ్రత్తగా నాలుగు జిల్లాల్లోని తమ జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులను ఉత్తర, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విహార యాత్రలకు పంపి,శిబిరాలను నిర్వహిస్తోంది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లోని 12 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగా… ఇందులో రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో రెండేసి, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున స్థానాలు ఏకగ్రీవం కాగా, ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ జిల్లాల్లో తెరాసకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా… అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో అధిష్ఠానం, 4 జిల్లాల్లోని ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించింది.

ఆదిలాబాద్‌: ఈ జిల్లాలో ఒక స్థానానికి తెరాస నుంచి దండె విఠల్‌, స్వతంత్ర అభ్యర్థిగా పి.పుష్పరాణి పోటీలో ఉన్నారు. మొత్తం 937 మంది ప్రజాప్రతినిధులకు 717 మంది తెరాసవారున్నారు.

కరీంనగర్‌: ఇక్కడ రెండు స్థానాల్లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్‌, మరో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 1324 మందికి 996 మంది తెరాస వారున్నారు.

ఖమ్మం: ఇక్కడ ఒక స్థానానికి తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. 768కి 490 మంది తెరాస వారున్నారు.

మెదక్‌: ఒక స్థానంలో మెదక్‌ జిల్లాలో తెరాస అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పోటీలో నిలిచారు. 1026 ప్రజాప్రతినిధుల్లో 777 మంది అధికార పార్టీవారున్నారు.

నల్గొండ: ఇక్కడ తెరాస నుంచి ఎంసీ కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 1271 మంది ప్రజాప్రతినిధులకు.. తెరాస 991 వారు ఉన్నారు.

*శిబిరాలవైపే మొగ్గు*

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గత నెల 26తో ముగిసిన వెంటనే ఎన్నికలు జరిగే స్థానాల్లో పార్టీ అభ్యర్థులను యాత్రలకు పంపించింది. మెదక్‌ జిల్లా ప్రజాప్రతినిధులు బెంగళూరు, మైసూరు, గోవా వెళ్లారు. కరీంనగర్‌ జిల్లావారిని రెండు బృందాలుగా యాత్రలకు పంపించారు. ఒక బృందం హైదరాబాద్‌ శివార్లలోని రిసార్టులో ఉండగా, మరో బృందం గోవా, దిల్లీలకు వెళ్లింది. ఆదిలాబాద్‌ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌, సమీప ప్రాంతాల్లో ఉన్నారు. ఖమ్మంవారు గోవాలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 4 వరకు వాటిని పూర్తి చేసి, 6 నుంచి 3 రోజుల పాటు యాత్రలకు వెళ్లే అవకాశముంది. కరీంనగర్‌ జిల్లా తిరుగుబాటు అభ్యర్థి, మెదక్‌, ఖమ్మంలలో కాంగ్రెస్‌ పోటీ దృష్ట్యా ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులపై తెరాస ప్రత్యేక దృష్టి సారించింది.