నేడు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పోలింగ్…

10వ తేదీన ఆరు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంది. పోలింగ్‌కు సంబంధించి ఎన్నిక‌ల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మొత్తం 37 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 5,326 ఓట‌ర్లు ఉన్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మెద‌క్‌, ఆదిలాబాద్‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌నున్నారు. పోలింగ్ కేంద్రాల‌కు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ సెంట‌ర్ల‌లోకి సెల్‌ఫోన్ల అనుమ‌తి ఉండ‌దు. సీసీ కెమెరాల‌తో పాటు వెబ్ కాస్టింగ్ చేయ‌నున్నారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేప‌ట్ట‌నున్నారు. అప్ప‌టి వ‌ర‌కు స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేయ‌నున్నారు.

క‌రీంన‌గ‌ర్‌..
క‌రీంన‌గ‌ర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి 8 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్థానిక సంస్థ‌ల ప‌రిధిలో మొత్తం ఓట‌ర్లు 1,324. కాగా 10 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్ ర‌మ‌ణ‌, భానుప్ర‌సాద్ రావు పోటీలో ఉన్నారు.

ఖ‌మ్మం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక నేప‌థ్యంలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం నలుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీ చేస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు ఈ శాసన మండలి నియోజకవర్గం విస్తరించి ఉంది. మొత్తం 568 మంది ఓటర్లు ఉన్నారు.

ఆదిలాబాద్‌..
ఆదిలాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇక్క‌డ 8 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 937 మంది ఓట‌ర్లు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి దండె విఠ‌ల్, స్వ‌తంత్ర అభ్య‌ర్థి పుష్ప‌రాణి బ‌రిలో ఉన్నారు.

మెద‌క్..
ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 9 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌గా, సంగారెడ్డి జిల్లాలో 4, మెదక్ జిల్లాలో 3, సిద్దిపేట జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మొత్తం ఓట‌ర్లు 1026. ఈ స్థానానికి టీఆర్ఎస్ నుంచి యాద‌వ‌రెడ్డి, కాంగ్రెస్ త‌ర‌పున తూర్పు నిర్మ‌ల‌, ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా మ‌ల్లారెడ్డి బ‌రిలో ఉన్నారు.

న‌ల్ల‌గొండ..
ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు 8 కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 1271 మంది ఓట‌ర్లు ఉన్నారు. ఈ స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు న‌గేశ్‌, ల‌క్ష్మ‌య్య‌, కే వెంక‌టేశ్వ‌ర్లు, ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, కొర్ర రామ్‌సింగ్ పోటీ ప‌డుతున్నారు.