బోరిస్ జాన్సన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. భారత్‌ టీకా ధ్రువీకరణ పత్రాల గుర్తింపుని స్వాగతిస్తూనట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించిన మోదీ..!

బోరిస్ జాన్సన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. భారత్‌ టీకా ధ్రువీకరణ పత్రాల గుర్తింపుని స్వాగతిస్తూనట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించిన మోదీ..

దిల్లీ: వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి తదితర సమస్యలపై పరస్పర సమన్వయంతో పోరాడాలని భారత్‌, యూకే నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో సంభాషించారు. ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘బోరిస్ జాన్సన్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా భారత్‌- యూకే ఎజెండా 2030 పురోగతిని సమీక్షించాం. దీంతోపాటు గ్లాస్గోలో సీఓపీ-26 సమావేశం నేపథ్యంలో వాతావరణ మార్పుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నాం. అఫ్గాన్‌ సహా ఇతర ప్రాంతీయ సమస్యలపై చర్చించాం’ అని పేర్కొన్నారు. క్వారంటైన్‌ నిబంధనలు, వ్యాక్సిన్‌ ధ్రువపత్రాల గుర్తింపు విషయంలో ఇటీవల బ్రిటన్‌, భారత్‌ మధ్య వివాదం చెలరేగడం, చివరకు బ్రిటన్‌ దిగిరావడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల ప్రధానులు మాట్లాడుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్‌ టీకా ధ్రువీకరణ పత్రాలను బ్రిటన్‌ గుర్తించడం స్వాగతించదగిన పరిణామమని ఇద్దరు నేతలూ అంగీకరించినట్లు సమాచారం..